తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముందుంటుందని వైసీపీ నేతలు గొప్పలు చెబుతోన్న సంగతి తెలిసిందే. అయితే, వృద్ధాప్య పెన్షన్ తో సహా పలు పథకాలలో అక్రమాలు జరుగుతున్నాయి, అర్హులకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండ చూసుకొని కొందరు ఒకటికి రెండు సార్లు లబ్ధిపొందుతుండగా….మరికొందరు అన్ని అర్హతలున్నా అన్యాయమైపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకంలో అక్రమాలు జరిగాయని తాజాగా ఓ సర్వేలో వెల్లడి కావడం కలకలం రేపుతోంది. ఈ షాకింగ్ సర్వేలోని విషయాలను పాఠశాల విద్యాశాఖ వెల్లడించడంతో ఆ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ పథకానికి ముందుగా ప్రతి విద్యార్థి అర్హులేనని చెప్పిన జగన్…ఆ తర్వాత కుటుంబంలోని ఒక్కరే అర్హులని చెప్పారు. అయితే, మాట తప్పి..మడమ తిప్పిన తర్వాత ఒక కుటుంబంలో ఒకరే లబ్ధి పొందాల్సి ఉండగా…కొన్నిచోట్ల అధికార పార్టీ నేతల చేతివాటంలో ఇద్దరు ప్రయోజనం పొందినట్లు వెల్లడి కావడం కలకలం రేపుతోంది.
అంతేకాదు, ఈ పథకానికి అనర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు కూడా లబ్ధిదారులుగా ఉండడం, నగదు వారి ఖాతాల్లో జమ కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. వాస్తవానికి ఈ పథకం కింద ఈ ఏడాది 44.48 లక్షల మందికి రూ.15వేల చొప్పున జమ చేశారు. అయితే, ఇందులో అవకతవకలు జరిగాయన ఆరోపణలు రావడంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది చొప్పున సర్వే చేయగా….353 మందికి అక్రమంగా నగదు జమ అయిందని తెలుస్తోంది.
దీంతో, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, భవిష్యత్లో ఈ తరహా వ్యవహారాలు పునరావృతం కాకుండా చూడాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లను పాఠశాల విద్య డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశించారు. ఈ ప్రకారం మెమో కూడా జారీ చేశారు. తమ ఆదాయం పరిమితికి మించిందన్న కారణంతో అమ్మ ఒడి నుంచి తొలగించేందుకే ఇలా చేస్తున్నారని చిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక, లబ్ధిదారుల సంఖ్య తగ్గించి ఖజానాను నింపుకునేందుకు ఈ పథకంతో పాటు పెన్షన్లలోను కోత పెడుతున్నారని తెలుస్తోంది.