సంచలనంగా మారిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి.
చిన్నపాటి ఆరోపణగా మొదలైన ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు అంతకంతకూ పెరుగుతూ భారీ కేసుగా మారింది.
ఇప్పటికే సీఐ ప్రణీత్ రావు సస్పెండ్ కావటం.. అరెస్టు కావటం తెలిసిందే.
కోర్టు అనుమతితో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్న అధికారులు విచారణ వేళ.. మరిన్ని సంచలన అంశాలు వెలుగు చూశాయి.
దీంతో.. ఆడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులైన భుజంగరావు.. తిరపతన్నను అదుపులోకి తీసుకోవటం.. ఆపై అరెస్టు చేయటం తెలిసిందే.
వారిని ఎనిమిది గంటలకు పైనే విచారించిన పోలీసులు తాజాగా రిమాండ్ చేశారు.
ఈ క్రమంలో వీరి రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు వెలుగుచూశాయి.
పోలీసు ఉన్నతాధికారి అయిన ప్రభాకర్ రావు చెబితేనే తాము ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించారు.
అంతేకాదు.. పలు సందర్భాల్లో భుజంగరావు.. తిరపతన్న ఇచ్చిన ఫోన్ నెంబర్లను తాను ట్యాపింగ్ చేసినట్లుగా ఒప్పుకున్నారు.
అంతేకాదు ఎన్నికల వేళ వందలాది నెంబర్లను.. రాజకీయ నేతలకు సంబంధించిన ఫోన్లను తాను ట్యాప్ చేసినట్లుగా ప్రణీత్ రావు ఒప్పుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
తమ ట్యాపింగ్ లో భాగంగా రాజకీయ నేతలు మాత్రమే కాదు వారి కుటుంబాల మీద కూడా తాము ఫోకస్ చేసినట్లుగా పేర్కొన్నారు.
పలువురు రాజకీయ నేతలు.. వారి అనుచరులు.. వ్యాపారవేత్తలతో పాటు సొసైటీలో పేరున్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజున తమ ఉన్నతాధికారిఅయిన ప్రభాకర్ రావు చెప్పినట్లుగా వ్యవహరించి.. ట్యాపింగ్ కు సంబంధించిన ప్రధాన డివైజ్ ను పూర్తిగా ధ్వంసం చేసిన విషయాన్ని అంగీకరించినట్లుగా తెలిసింది.
తాము ధ్వంసం చేసిన కంప్యూటర్లు 17గా పేర్కొన్న ప్రణీత్ రావు.. అన్నింట్లోని హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేసి.. హార్డ్ డిస్క్ ప్రధాన డివైజ్ ను కట్టర్ తో ముక్కలు ముక్కలు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఆ ముక్కల్ని మూసీలో పడేసినట్లుగా ఒప్పుకున్నాడు.
అంతేకాదు రెండు లాకర్ రూమ్ లలో ఉన్న అన్ని డాక్యుమెంట్లను తగలబెట్టినట్లుగా ప్రణీత్ రావు అంగీకరించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా అరెస్టు అయి రిమాండ్ కు వెళ్లిన మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు విషయానికి వస్తే.. ఆయన రిమాండ్ రిపోర్టులో మరిన్ని సంచలన అంశాలు వెలుగు చూశాయి.
బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను తాము ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు వెల్లడించారు.
బీఆర్ఎస్ నేత ఇచ్చిన నెంబర్లను ఎప్పటికప్పుడు ప్రణీత్ రావుకు తాము పంపించామన్న ఆయన.. అతడు ఇచ్చే సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేసినట్లుగా పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలామంది రాజకీయ నేతల ఫోన్లను.. వారి కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు అంగీకరించారు.
మాజీ టాస్క్ ఫోర్సు డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చే నెంబర్లను ప్రణీత్ రావుకు ఇచ్చామని అరెస్టు అయిన మరో పోలీసు అధికారి తిరుపతన్న పేర్కొన్నారు.
డీసీపీ చెప్పిన నెంబర్లతో పాటు మరికొందరి కదలికల్ని తాము ట్రాక్ చేసిన వైనాన్ని ఒప్పుకున్నారు.
దీంతో.. వీరికి గైడ్ చేసిన కీలక నేత ఎవరు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
త్వరలోనే ఆ చిక్కుముడి వీడుతుందనన అభిప్రాయం వ్యక్తమవుతోంది.