దేశంలోనే అత్యుత్తమ సర్వీసుగా చెప్పే ఐఏఎస్.. ఐపీఎస్ లకు సంబంధించి ఇటీవల కాలంలో దరిద్రపుగొట్టు ట్రెండ్ ఒకటి మొదలైంది. టార్గెట్ పెట్టుకొని మరీ ఈ సర్వీసుల్ని సొంతం చేసుకుంటున్న వారు.. వచ్చీ రాగానే దుకాణం తెరిచేస్తున్న వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. తెలంగాణకు గడిచిన కొంతకాలంగా వస్తున్న యువ ఐపీఎస్ ల తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ దారుణ దందాలో యువ మహిళా ఐపీఎస్ ల పేర్లు వినిపిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ దారుణ తీరు గురించి ఒక ప్రముఖ మీడియా సంస్థ సంచలన కథనాన్ని అచ్చేసింది. ఇదిప్పుడు ఐపీఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. మరీ ఇంతలా బరితెగిస్తున్నారా? అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి. వీరి తీరుకు ప్రభుత్వ పెద్దలు సైతం తలపట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. భరించలేనంతగా పెరిగిన కొందరి తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇంకా విధుల్లోకి చేరక ముందే మరీ ఇంతలా వసూళ్లు చేయటం.. అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటామన్న భరోసాను ఇవ్వటమే కాదు.. వారే వ్యాపారాలు షురూ చేయిస్తున్న తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇలా చేస్తున్న ఒక ఐపీఎస్ కు ప్రభుత్వంఛార్జి మెమోను ఇవ్వటం విశేషం. ఇలా బరితెగిస్తున్న మరికొందరిని అప్రాధాన్యత పోస్టులకు పెట్టేస్తూ సరిపుచ్చుతున్నారు. అయినా వీరి దందాపై ఒక కన్నేసి ఉంచాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంచలనంగా మారిన సదరు కథనంలోని కొన్ని అంశాల్ని చూస్తే..
హైదరాబాద్ శివారులో ఒక కీలకమైన విభాగానికి బదిలీ మీద వచ్చిన ఒక మహిళా ఐపీఎస్ అధికారిణి అక్కడ అడుగు పెట్టి పెట్టగానే.. భారీ వసూళ్ల దందా మొదలు పెట్టారట. అంతేకాదు.. ఆమె ఎక్కడ పని చేసినా.. దగ్గర్లోని విల్లాల ధరల గురించి ఆరా తీయటం ఆమెకు ఒక అలవాటుగా చెబుతారు. అందుకే ఆమెను విల్లా రాణిగా పిలుస్తారని చెబుతారు. ఆమెపై ఆరోపణలు మరింత పెరిగిపోవటంతో కీలకస్థానంలో ఉన్న ఆమె పోస్టు తీసేసి.. మరో చోటుకు బదిలీ చేశారు. అయినప్పటికీ తీరులో మార్పు రాకపోవటంతో.. అక్కడి నుంచి మళ్లీ బదిలీ వేటు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఎన్నికల వేళలో జిల్లా ఎస్పీగా పోస్టు తీసుకున్న ఒక యువ ఐపీఎస్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని ఖర్చు చేసినట్లుగా చేసి.. అవినీతికి బోణీ కొట్టిన వైనం వెలుగు చూసింది. ఆ తర్వాత ఖర్చుల కోసం కింది సిబ్బందికి సినిమా చూపించారు. దీంతో.. విషయం ఉన్నతాధికారులకు తెలిసి అప్రాధాన్యత పోస్టుకు పంపేయటం గమనార్హం. మరో ఎస్పీ విషయానికి అతగాడు మరీ తేడా.
తెలంగాణలో పేకాట మీద బ్యాన్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. తాను పని చేస్తున్న జిల్లా కేంద్రంలో ఒక ఎస్పీ.. దొంగచాటుగా ఒక అపార్టుమెంట్ లో పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేయటమే కాదు.. దాని మొయింటెన్స్ ను ఒక ఫ్యామిలీ మెంబర్ కు అప్పగించిన బరితెగంపు అతగాడి సొంతంగా చెబుతారు. ఈ విషయం ప్రభుత్వం వరకు రావటంతో.. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీంను పంపి.. ఆ ఇంట్లో రైడ్ చేయించారు. ఎస్పీకి చెప్పాలా? అంటూ తనిఖీకి వచ్చిన అధికారిని బెదిరించగా.. వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పటం గమనార్హం.
ఇక.. మరో యువ మహిళా ఐపీఎస్ విషయానికి వస్తే.. ఆమెకు ఎప్పుడు ఎలాంటి పోస్టు ఇచ్చినా.. ఇంటిపట్టునే ఉండటం.. ఆఫీసు ముఖం చూడటం ఆమె ప్రత్యేకత. దీంతో.. ఆమెకు ఒక అప్రాధాన్యత పోస్టుకు పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. మరో మహిళా ఐపీఎస్.. ప్రొబేషనరీగా సౌత్ తెలంగాణలో పని చేసి సైబరాబాద్ కమిషనరేట్ లోని ఒక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తన పరిధి కానప్పటికీ.. నేరుగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీట్లో కూర్చొని ఒక భూ వివాదానికి సంబంధించిన కేసు ఫైల్ తేవాలని ఆర్డర్ వేశారు.
ఆ టైంలో ఆమెతో ఆ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా ఉండటం గమనార్హం. ఇలా చేయటం రూల్ ఒప్పుకోదని చెప్పినా వినిపించుకోలేదు సరికదా.. తన భర్త ఐపీఎస్ అని చెప్పటంతో తల పట్టుకున్న పరిస్థితి. ఆమెను బలవంతంగా పంపి.. తర్వాత ఆమెకు ఛార్జిమెమో జారీ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలానే ఉందంటున్నారు.