బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా తీసిన సినిమాలు తక్కువే. కానీ అందులో రెండు అద్భుతమైన చిత్రాలున్నాయి. అవి క్లాసిక్స్‌గా పేరు తెచ్చుకుని చిర స్థాయిగా నిలిచిపోయాయి. అందులో మొదటిది ఆమిర్ ఖాన్, మాధవన్, సిద్దార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన రంగ్ దె బసంతి. 2006లో వచ్చిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్టయింది. ఇక లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా ఫర్హాన్ అక్తర్‌తో రాకేశ్ రూపొందించిన బాగ్ మిల్కా బాగ్ కూడా ఘనవిజయం సాధించింది. క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది.
ఐతే ఈ రెంటికి మధ్య రాకేశ్ నుంచి మరో సినిమా వచ్చింది. అదే.. ఢిల్లీ-6. రెహమాన్ అందించిన ఆడియో బ్లాక్ బస్టర్ అయ్యాక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయింది. ఈ ఫెయిల్యూర్ రాకేశ్ మీద తీవ్ర ప్రభావమే చూపిందట. ఈ పరాజయాన్ని తట్టుకోలేక తన ప్రాణాలే తీసుకోవాలనుకున్నాడట రాకేశ్. ఈ విషయాన్ని తన ఆత్మకథలో స్వయంగా రాకేశే చెప్పాడు. ఢిల్లీ-6 మీద చాలా ఆశలు పెట్టుకున్నానని.. కానీ ఆ ఆశలు వమ్ముకోవడంతో నిరాశలో కూరుకుపోయానని రాకేశ్ తెలిపాడు.
‘ఢిల్లీ-6’ డిజాస్టర్ కావడంతో తాను ఒక దశలో తాగుడుకు బానిస అయ్యానని.. అలా తాగి తాగి చచ్చిపోవాలని కోరుకున్నానని రాకేశ్ తెలిపాడు. ఐతే కుటుంబ సభ్యులు, సన్నిహితుల సాయంతో నెమ్మదిగా కోలుకున్నానని రాకేశ్ తెలిపాడు. ‘ఢిల్లీ-6’ వచ్చిన ఏడేళ్ల తర్వాత రాకేశ్ తన తర్వాతి చిత్రం తీశాడు. అదే.. బాగ్ మిల్కా బాగ్. ఆ సినిమా మళ్లీ అతణ్ని ఫాంలోకి తెచ్చింది. కానీ ఆ తర్వాత తీసిన రెండు సినిమాలూ డిజాస్టర్లయ్యాయి. అనిల్ కపూర్ తనయుడితో చేసిన ‘మిర్జియా’ దారుణ ఫలితాన్నందుకుంది. ‘బాగ్ మిల్కా బాగ్’ హీరో ఫర్హాన్ అక్తర్‌తో మళ్లీ జట్టు కడుతూ రాకేశ్ తీసిన ‘తూఫాన్’ ఇటీవలే అమేజాన్ ప్రైమ్‌లో రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.