ఏపీలో రోడ్ల దుస్థితిపై కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్ హయాంలో రోడ్లు చెరువులు, తటాకాలను తలపిస్తున్నాయని, అమూల్ సంస్థ కోసం పాలు ఇస్తున్న గేదెల కోసం జగనన్న రోడ్లపైనే స్విమ్మింగ్ పూల్స్ కట్టించి జనాన్ని ఫూల్స్ ని చేశారని సోషల్ మీడియాలో మీమ్స్ తో ట్రోలింగ్ జరుగుతోంది. ఇక, చాలా పల్లెల్లో మట్టి రోడ్లే దర్శనమిస్తున్నాయని, వానాకాలంలో ఈ మట్టి రోడ్లమీద మడ్ ఫెస్టివల్ వంటి గేమ్స్ నిర్వహించుకునే చేసిన ఘనత జగన్ దేనని సెటైర్లు పేలుతున్నాయి.
అయితే, ఈ మధ్య కాలంలో ఏపీలోని పలు జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సిమెంటు రోడ్లు నిర్మిస్తున్నారు. రెడీమిక్స్ కాంక్రీట్ మిల్లర్లతో రాత్రికి రాత్రే వీధులకు వీధులు సిమెంటుమయమవుతున్నాయి. ఈ విమర్శలకు, ట్రోలింగ్ కు భయపడి జగన్ హుటాహుటిన సిమెంటు రోడ్లు వేయిస్తున్నారని జనం అనుకుంటున్నారు. ఇక, జనంపై జగన్ ప్రేమతో రోడ్లు వేయిస్తున్నారని వైసీపీ నేతలు యథావిధిగా ఆ క్రెడిట్ ను తమ నాయకుడి ఖాతాలో వేసేశారు.
ఇక, ఆ రోడ్ల కాంట్రాక్టులు వైసీపీలోని మండల స్థాయి నేతలకు దక్కాయని…మమ అనిపించేలా నిబంధనలు తుంగలో తొక్కేసి నాసిరకం రోడ్లు వేస్తున్నా సంగతి జనానికి తెలిసినా…తమ కాళ్లకు బురదంటకుండా ఇళ్లకు చేరుతున్నాం కదా అన్న ఆనందంలో ఆ విషయాన్ని వారు ఎప్పటిలాగే పెద్దగా పట్టించుకోలేదు. అయితే, జగన్ సిమెంటు రోడ్ల జపం చేయడం వెనుక గుట్టును ప్రతిపక్ష టీడీపీ నేతలు సాక్షాధారాలతో సహా బట్టబయలు చేశారు.
జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు…జులై 26,2021 వరకు ఏపీలో ఒక్కటంటే ఒక్క కొత్త సిమెంటు రోడ్డు వేయలేదన్న విషయం బట్టబయలు కావడంతోనే జగనన్న హడావిడిగా సిమెంటు రోడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారని వెల్లడైంది. సమాచార హక్కు చట్టం ద్వారా మంగళగిరికి చెందిన టీడీపీ నేత దారపనేని నరేంద్ర బాబు అడిగిన ప్రశ్నకు రోడ్లు, భవనాల శాఖాధికారులు ఇచ్చిన సమాధానంతో జగన్ గుట్టురట్టయింది.