ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పలు మార్లు ఏపీ సర్కార్ పై హైకోర్టు, సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు కోర్టుల్లో జగన్ సర్కార్ కు చుక్కెదురైనప్పటికీ తన అనాలోచిత నిర్ణయాలను జగన్ కొనసాగిస్తూనే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు మరో షాకిచ్చింది. సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 2ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది.
పంచాయితీ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ గతంలో జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 2పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేసింది. ఇప్పటి వరకూ సర్పంచులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో జరిగిన పాలనను…వీఆర్వోలకు అప్పగించడమేంటని ఏపీ హైకోర్టు నిలదీసింది. పంచాయతీ సర్పంచ్ అధికారాలు వీఆర్వోలకు ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 సవరణకు, ఏపీ పంచాయితీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జీవో 102 ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఆ జీవోను రద్దు చేసింది.
ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. గ్రామపంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ ఉండగా.. సమాంతరంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలను పంచాయతీల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లకూడదా అని ప్రశ్నించింది. రాష్ట్రానికి సీఎం ఎలా అధిపతో.. పంచాయతీలకు సర్పంచ్ కూడా అలాగేనని హైకోర్టు పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.