జగన్ పై కోడి కత్తి దాడి కేసు వ్యవహారం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కరాఖండిగా చెప్పినా…జగన్ మాత్రం హాజరు కాలేదు. జగన్ ను ఎందుకు విచారణ జరపలేదని, ఆ వివరాలు ఎందుకు చార్జ్ షీట్ లో పొందు పరచలేదని విమర్శలు వచ్చాయి. అయితే, తాను వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని జగన్ సాకులు చెప్పారు.
ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కోర్టును మినహాయింపు కోరగా జగన్ తరపున ఆయన పీఏ కె నాగేశ్వరరెడ్డి కోర్టుకు ఏప్రిల్ 10న హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై నేడు మరోసారి విచారణ జరిగింది. ఎన్ఐఏ కోర్టులో ఎన్ఐఏ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కోడి కత్తి కేసులో కుట్ర కోణం లేదని ఎన్ ఐఏ అధికారులు వెల్లడించారు. రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ కు ఈ ఘటనతో సంబంధం లేదని పేర్కొన్నారు.
నిందితుడు శ్రీనివాసరావు టిడిపి సానుభూతిపరుడు కాదని తేలినట్లుగా కౌంటర్ లో వెల్లడించారు. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంక దర్యాప్తు అవసరం లేదని తెలిపారు. జగన్ వేసిన పిటిషన్ కొట్టివేయాలని కోర్టును ఎన్ఐఏ అభ్యర్థించింది. అయితే వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని జగన్ తరఫున న్యాయవాదులు కోరారు. దీంతో, ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 17వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.