గులాబీ పార్టీ బీఆర్ఎస్ కు తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఒకసారి పిటిషన్ వేసిన తర్వాత.. రెండోసారి అదే అంశంపై పిటిషన్ దాఖలు చేయటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన న్యాయస్థానం రూ.లక్ష జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. సదరు భవనం క్రమబద్ధీకరణకు నో చెప్పటమే కాదు 15 రోజుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాజా పరిణామంతో నల్గొండలోని బీఆర్ఎస్ భవనాన్ని కూల్చివేయక తప్పనిసరి పరిస్థితి. ఇంతకూ ఏమైందంటే..?
నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భవనాన్ని క్రమబద్ధీకరించాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఆ భవనాన్ని క్రమబద్ధీకరించేందుకు హైకోర్టు నో చెప్పింది. అంతేకాదు.. పదిహేను రోజుల్లో అక్రమ నిర్మాణాల్ని తొలగించాలని పేర్కొంటూ జులై 20న నల్గొండ మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీందర్ పిటిషన్ దాఖలు చేశారు. గతంలోనూ పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు హైకోర్టు నో చెప్పింది.ఈ ఇష్యూలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే.. తాజాగా కమిషనర్ ఉత్తర్వులను సవాల్ చేయటానికి ప్రత్యామ్నాయం లేని కారణంగా హైకోర్టును మరోసారి ఆశ్రయించినట్లుగా తాజా పిటిషన్ దాఖలుసందర్భంగా పేర్కొన్నారు. అయితే.. గతంలో నోచెప్పిన అంశానికి సంబంధించి మళ్లీ ఎలా పిటిషన్ దాఖలు చేస్తారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై పిటిషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. క్రమబద్దీకరణ అప్లికేషన్ ను తిరస్కరిస్తూ కమిషనరర్ జారీ చేసిన ప్రోసీడింగ్స్ ను సవాలు చేసినట్లుగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
అయితే.. పార్టీ భవన క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవటానికి హైకోర్టు గతంలోనే నో చెప్పిందని.. అదే అభ్యర్థనపై తిరిగి మరో పిటిషన్ ను వేయటాన్ని తప్పుపట్టింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఒకే అభ్యర్థనపై రెండుసార్లు పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించి.. కోర్టు సమయాన్ని వేస్టే చేసినందుకు రూ.లక్ష ఫైన్ వేస్తూ నాలుగు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.