మనదేశంలో రాజకీయ నాయకులలో చాలామందిపై సివిల్, క్రిమినల్ కేసులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసుల విచారణ పూర్తయి…వాటిల్లో తీర్పు వచ్చి..సదరు ప్రజాప్రతినిధులకు శిక్ష పడేలోపు…వారు కనీసం రెండు, మూడు సార్లు ఎన్నికల్లో పాల్గొని గెలవడమో ఓడడమో జరుగుతుంది. అందుకే, ఈ కేసుల సత్వర విచారణకు ప్రజాప్రతినిధుల కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీలోని 24 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని వెల్లడైంది.
2019 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన 2,495 మంది ప్రజాప్రతినిధుల అఫిడవిట్లను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్) అధ్యయనం చేసి నివేదిక విడుదల చేసింది. 67 మంది ఎంపీలు, 296 మంది ఎమ్మెల్యేల (మొత్తం 363 మంది)పై అభియోగాలు నమోదైనట్లు తేల్చింది. ఈ నివేదిక ప్రకారం ఏపీలో 24 మందిపై కేసులున్నాయని తేలింది. ఈ సెక్షన్ల ప్రకారం సదరు నేతలపై నేరం రుజువై శిక్ష పడితే వారిపై అనర్హత వేటు పడడం ఖాయం.
ఈ జాబితాలో వైసీపీ నుంచి నలుగురు ఎంపీలు, 18 మంది ఎమ్మెల్యేలు ఉండడం విశేషం.. వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ పీవీ మిథున్‌రెడ్డి (రాజంపేట), వైసీపీ ఎంపీలు మార్గాని భరత్ (రాజమండ్రి), బెల్లాన చంద్రశేఖర్ (విజయనగరం), ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ) ఈ లిస్టులో ఉన్నారు. ఇక, మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి సహా 18 మంది ఎమ్మెల్యేల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
మరోవైపు, వైసీసీకి అనధికారింగా మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్ పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తెలంగాణలో సోయం బాపూరావు (బీజేపీ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), మాలోతు కవిత (టీఆర్ఎస్) పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. అయితే, వైసీపీ నేతలపై ఉన్న కొన్ని కేసులు విత్ డ్రా కాగా.. మరి కొన్ని విచారణ దశలో ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా వారి నేరం రుజువైతే మాత్రం అనర్హత వేటు తప్పదని, ఈ విషయంపై సుప్రీం కోర్టు కూడా సీరియస్ గా ఉందని తెలుస్తోంది.