యువ కథానాయకుడు శర్వానంద్ కెరీర్ ఒకప్పుడు మంచి ఊపులో ఉండేది. రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, మహానుభావుడు లాంటి చిత్రాలతో మంచి జోష్‌లో కనిపించాడు శర్వా. కానీ ఆ తర్వాత అతడి కెరీర్ గాడి తప్పింది. చాలా ఏళ్ల నుంచి అతడికి సరైన విజయం లేదు. మధ్యలో ‘ఒకే ఒక జీవితం’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కానీ.. కమర్షియల్‌గా అది కూడా ఆశించినంత సక్సెస్ కాలేదు.
జాను, శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు అతడికి మంచి కమర్షియల్ సక్సెస్ పడటం చాలా అవసరం. అందుకే ఈసారి శర్వా చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. దాదాపు ఏడాది పాటు సినిమాలే చేయని శర్వా.. ఆచితూచి రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. ఆ రెండు చిత్రాల విశేషాలు ఈ రోజు బయటికి వచ్చాయి. అందులో ఒకటి.. మనమే.
‘భలే మంచి రోజు’తో ప్రామిసింగ్ డెబ్యూ ఇచ్చి ఆ తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తీస్తున్న చిత్రమే.. మనమే. ఈ రోజు రిలీజ్ చేసిన ప్రి లుక్ పోస్టర్, గ్లింప్స్ చాలా ఆకర్షణీయంగా అనిపించాయి. శర్వా ఇమేజ్‌కు తగ్గ స్లైస్ ఆఫ్ లైఫ్ సినిమాలా కనిపిస్తోంది ఈ మూవీ. పోస్టర్ చూడగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతోంది. ఇక శర్వా చేస్తున్న మరో చిత్రం.. ‘లూజర్’ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నది.
ఇది ‘మనమే’కు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఒక క్రేజీ రైడ్ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రి లుక్ పోస్టర్ చూస్తే. ఇది తెలుగు సినిమాల్లో అరుదు అనదగ్గ రేసింగ్ మీద నడిచే కథ. శర్వా ఇందులో బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నాడు. మొత్తానికి శర్వా పుట్టిన రోజు కానుకగా రిలీజైన రెండు సినిమాల పోస్టర్లూ ఆసక్తికరంగా ఉన్నాయి. అతడి కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రాల్లాగే కనిపిస్తున్నాయి. మరి కొత్త ఏడాది అతడికి ఏమేర కలిసి వస్తుందో చూడాలి.