ప్రపంచాన్ని ఆగం చేసిన కరోనా.. దేశంలో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దశలో రోజుకు 90వేల కేసులు నమోదైన పరిస్థితి. అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు.. ఎక్కడి వరకు వెళుతుందన్న భయాందోళనలు వ్యక్తమైన వేళలో.. అందుకు భిన్నంగా కేసుల నమోదు తగ్గుముఖం పట్టటం పాలకులకు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇదిలా ఉంటే.. గడిచిన మూడు నెలల్లో ఎప్పుడు లేనట్లుగా.. తొలిసారి తక్కువ కేసులు నమోదు కావటం ఆసక్తికరంగా మారింది.
గడిచిన రెండు వారాల క్రితం కూడా రోజుకు 60వేల కేసులు నమోదైన పరిస్థితి. దేశంలోని నాలుగైదు రాష్ట్రాల్లో తప్పించి.. మిగిలిన రాష్ట్రాల్లో కేసుల నమోదు తగ్గుముఖం పట్టిన పరిస్థితి. తాజాగా తీవ్ర వ్యాప్తి ఉన్న రాష్ట్రాల్లో కూడా కేసుల నమోదు జోరు తగ్గింది. గడిచిన 24 గంటల్లో 46,790 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జులై 28 తర్వాత 50 వేల కంటే తక్కువ కేసులు నమోదైంది మంగళవారం మాత్రమే. కేసుల నమోదు తగ్గటం.. రికవరీ రేటు పెరగటం.. మరణాల రేటు సైతం తగ్గుముఖం పట్టటం లాంటివి చూసినప్పుడు.. అన్ని మంచి శకునములే అన్న భావన కలగటం ఖాయం.
సాధారణంగా ఒక వేవ్ నుంచి మరో వేవ్ కు వెళ్లే మధ్యలో కేసుల నమోదు తగ్గిపోవటం.. ఉన్నట్లుండి ఒక్కసారిగా విరుచుకుపడటం లాంటివి జరుగుతాయి. అమెరికా.. యూరప్ దేశాల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. సెకండ్ వేవ్ తో ఆయా దేశాలు ఆగమాగమైపోతున్నాయి. తాజాగా కొన్ని దేశాలు లాక్ డౌన్ విధించేందుకు సైతం సిద్ధమవుతున్నాయి.
వైరస్ బలహీనపడి.. మళ్లీ పుంజుకునే సంధి దశ చాలా కీలకం. ప్రస్తుతం వైరస్ బలహీనపడి.. మొదటి వేవ్ క్షీణ దశలో ఉంది. ఇలాంటప్పుడు అన్ని మంచి శకునాలే అన్నట్లు కనిపించినా.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్ని చూస్తే.. దేశంలో ఇప్పటివరకు 75.97లక్షల కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు కరోనా అధికారిక మరణాలు 1.15లక్షలు. రికవరీల సంఖ్య 67.33 లక్షలు కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7.48 లక్షలుగాతేలింది. ప్రస్తుతం రికవరీ రేటు 88.63గా ఉంది. ప్రస్తుతానికి సానుకూల వాతావరణం ఉన్నట్లు కనిపిస్తున్నా.. నిర్లక్ష్యం.. అలక్ష్యం ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీ కేర్ ఫుల్.