వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు విచిత్రమైన లాజిక్ ను తెరపైకి తెచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నికపై ఆమె ట్విట్టర్లో కేసీయార్ తో పాటు జనాలను ఉద్దేశించి కొన్ని ప్రశ్నలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెబితే తాము ఉపఎన్నికలో పాల్గొంటామని మెలిక పెట్టారు. హోలు మొత్తంమీద చూస్తే హుజూరాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పాల్గొనేది లేదంటు సింపుల్ గా చెప్పేశారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే షర్మిల ప్రశ్నలకు ఎవరు సమాధానాలు చెప్పలేరు. ఎందకంటే టీఆర్ఎస్ లో నుండి మాజీమంత్రి ఈటల రాజేందర్ బయటకు వచ్చేసిన కారణంగా ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఇక్కడ ఉపఎన్నిక అవసరమైంది. ఇంతకీ షర్మిల అడిగిన ప్రశ్నలు ఏమిటంటే హుజూరాబాద్ ఉపఎన్నిక వల్ల ఉపయోగం ఉంటుందా ? నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా ? దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా ? ఇవన్నీ జరుగుతుందని చెబితే తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని కండీషన్లు పెట్టారు.
ఆమె వేసిన ప్రశ్నలను పక్కనపెట్టేస్తే అసలు హుజూరాబాద్ ఉపఎన్నికలో షర్మిల పార్టీని పోటీ చేయమని ఎవరడిగారనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రజాస్వామ్యంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఉపఎన్నికలు వస్తుంటాయంతే. ప్రతి ఉపఎన్నికకు రాజకీయాపార్టీలు కారణాలు వెతుక్కోవు. గెలుస్తామనే నమ్మకం ఉంటే పోటీచేస్తాయి లేకపోతే లేదంతే.
ఉపఎన్నికల వల్ల జనాలకు ఉపయోగం ఉండాలన్నదే షర్మిల ఆలోచనతై 2009లో కాంగ్రెస్ పార్టీకి, ఎంపి పదవికి జగన్ రాజీనామా చేశారు. అప్పుడు కడప లోక్ సభకు మళ్ళీ ఉపఎన్నికలు జరిగాయి. అందులో పోటీచేసి జగన్ అత్యధిక మెజారిటితో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. మరపుడు ఆ ఉపఎన్నిక వల్ల జనాలకు ఏమి ఉపయోగమని షర్మిల అన్న తరపున ప్రచారం చేశారు ? కాబట్టి షరతులు పెట్టకుండా సత్తాచాటే ఉద్దేశ్యంతో ఉపఎన్నికల్లో పోటీ చేస్తే చేయాలి లేకపోతే దూరంగా ఉండాలంతే.