సీఎం కేసీఆర్ పై వైయస్సార్ టిపి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల షర్మిల అరెస్టు వ్యవహారం దుమారం రేపడంతో ఆమె విమర్శల తీరు కూడా మార్చారు. కేసీఆర్ పార్టీలో ఉన్న వారంతా తాలిబన్లేనని, తనకేం జరిగినా టిఆర్ఎస్ ప్రభుత్వందే బాధ్యత అని షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణను కేసీఆర్ ఆఫ్ఘనిస్తాన్ మాదిరి మార్చేశారని, తాలిబన్ల తరహాలో పాలన కొనసాగిస్తున్నారని షర్మిల సంచలన ఆరోపణ చేశారు.
కేసీఆర్ అవినీతిని బట్టబయలు చేస్తున్నానన్న కారణంతోనే తనపై కక్ష గట్టారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వేలకోట్ల అక్రమ సంపాదన అర్జించిందని, దేశంలో అత్యంత సంపన్నమైన రాజకీయ కుటుంబం కేసీఆర్ దేనిని ఆరోపించారు.ఆ అవినీతిని బట్టబయలు చేస్తున్నందుకే తనపై కేసీఆర్ కుటుంబం పగ సాధిస్తుందని ఆరోపించారు. తన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
ఆ వ్యాఖ్యల వ్యవహారం సద్దుమణగక ముందే కేసీఆర్ కు షర్మిల తాజాగా షాకింగ్ లేఖ రాశారు. ఏమాత్రం భవిష్యత్తు లేని బీఆర్ఎస్ అజెండాను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని లేఖలో షర్మిల విమర్శించారు. తెలంగాణకు చెందిన 8 మండలాలను ఏపీలో విలీనం అయ్యాయని, వాటి గురించి ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల పాలన పూర్తవుతున్నా సీతారామ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు.
గిరిజనులకు ఇంత వరకు పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. భద్రాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మరిచారని, తెలంగాణను అభివృద్ధి చేయలేని మీకు.. జాతీయ రాజకీయాలు ఎందుకని ఎద్దేవా చేశారు. మరి, షర్మిల కామెంట్లపై టీఆర్ఎస్ నేతల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.