వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కడపజిల్లా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద షర్మిల తన ఇద్దరు పిల్లలు, మాతృమూర్తి విజయమ్మలతో కలిసి నివాళులర్పించారు.అ నంతరం ప్రత్యేక ప్రార్థనల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ గొప్ప నాయకుడని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ను అభిమానించే ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. మరోసారి అందరూ వైఎస్సార్ ను గుర్తు చేసుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. వైఎస్సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిదేమీ లేదంటూనే ఆమె పరోక్షంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ పథకాలపై విమర్శలు గుప్పించారు. రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి వన్నీ పేదలకు ఆయన అందించిన ఫలాలేనని చెప్పారు.
అంటే.. ఇప్పటి వరకు ఈ పథకాల గొప్పను తనఖాతాలో వేసుకున్న సీఎంజగన్కు భారీ షాక్ ఇచ్చినట్టు అయిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. వైఎస్ హయాం గురించి షర్మిల మాట్లాడుతూ.. ఐదేళ్లలో 46 లక్షల పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం వైఎస్సార్ కే సాధ్యం అయ్యిందని చెప్పారు. అంటే.. పరోక్షంగా.. ఏపీలో ప్రభుత్వం పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వలేక పోయిందనే అర్థం వచ్చేలా ఆమె మాట్లాడడం గమనార్హం.
ఇక, అక్కడితో కూడా ఆగకుండా.. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చారని వైఎస్ ను కొనియాడారు. ఇప్పటి వరకు మైనారిటీలకు తాను ఎంతో చేశానని చెప్పుకొన్న జగన్కు ఇది భారీ ఎదురు దెబ్బగానే మారనుంది. వాస్తవానికి మైనారిటీలకు వైఎస్ హయాంలోనే 4శాతం రిజర్వేషన్ ఇచ్చినా..జగన్ ఎప్పుడూ చెప్పుకోలేదు. అంతా నేనే చేస్తున్నానని చెప్పుకోవడం తెలిసిందేనని.. పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి షర్మిల వ్యాఖ్యలు.. సీఎం జగన్ ఓటు బ్యాంకుకు గండి కొట్టేలా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.