ఏపీసీసీ చీఫ్గా షర్మిల బాధ్యతలు చేపట్టడంపై అనేక ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా `విశాఖ స్టీల్ ప్లాంట్` ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నేత రేవంత్ దీనికి సమాధానం చెప్పారు. ‘‘ఏపీ ప్రజల కష్టాలను చూసి షర్మిల ఏపీకి వచ్చారు వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకువస్తానని నాతో చెప్పారు. మీకు కావాల్సింది పాలకులు కాదు. ప్రశ్నించే గొంతుకలు“ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ చివరి కోరిక రాహుల్ గాందీ ప్రధాని కావడమేనని రేవంత్ రెడ్డి చెప్పారు. విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరన్నారు. తెలుగు రాష్టాల ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే అన్నదమ్ముల్లాగా కలిసి పోరాడుతామని చెప్పారు. “మనమంతా తెలుగు వాళ్లం.. మనమంతా అన్నదమ్ములం. పదేళ్లు గడుస్తున్నా పోలవరం పూర్తి కాలేదు. వైఎస్సార్ ఆశయాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన వారసులు ఎలా అవుతారు?“ అని పరోక్షంగా జగన్ పేరు ఎత్తకుండానే విమర్శలు గుప్పించారు.
ఏపీ బాగుపడాలంటే ప్రశ్నించే గొంతు కావాలని రేవంత్ అన్నారు. మిగతా పార్టీల నాయకులు ఎవరు ప్రశ్నించలేరని, షర్మిలకు ఆ సత్తా ఉందని తెలిపారు. “ప్రశ్నించి మీ సమస్యలు తీరుస్తుంది. షర్మిలమ్మను నమ్మి చట్ట సభల్లో కాంగ్రెస్ను గెలిపించండి. కాంగ్రెస్కు 25 ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు ఇవ్వండి“ అని రేవంత్ విన్నవించారు. విశాఖ స్టీల్ ప్లాంటును షర్మిలమ్మ ఇంచు కూడా కదలనివ్వదన్నారు. కాంగ్రెస్ నాయకత్వాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. “షర్మిలమ్మ ముఖ్యమంత్రి అయ్యాక మీ సమస్యలన్నీ తీరుస్తుంది. తెలంగాణ ఉప ఎన్నికల్లో మా పార్టీకి 3,200 ఓట్లు మాత్రమే వచ్చినప్పుడు కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. కానీ ఆ తర్వాత ఢిల్లోనీ మోడీని, తెలంగాణలోని కేడీని ఓడించి అధికారంలోకి వచ్చాం.“ అని రేవంత్ చెప్పారు.
5 ఎమ్మెల్యే సీట్ల నుంచి 65 సీట్లు గెలిచామని తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితిని ఆయన వివరించారు. ఇప్పుడు ఏపీలో కూడా కాంగ్రెస్ ఎక్కడ ఉంది అని అంటున్నారని, కానీ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే ఏపీలోనూ కాంగ్రెస్ గెలవడం ఖాయమని రేవంత్ రెడ్డి చెప్పారు. షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావడం ఖాయం అనిపిస్తుందన్నారు. కాగా, ఈ సభకు దాదాపు 3 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.