కాలానికి మించిన శక్తివంతమైనది మరొకటి లేదంటారు. ఎవరైనా సరే.. కాలానికి తలొగ్గాల్సింది. కాలమహిమ మాటకు అర్థం ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆయన సోదరి షర్మిల సగర్వంగా కొన్నేళ్ల క్రితం చెప్పి మరీ రోడ్ల మీదకు రావటం..కష్టకాలంలో సోదరుడికి ఎంతటి రక్షణ కవచంలా వ్యవహరించారో అందరికి తెలిసిందే. అలాంటి షర్మిల తాజాగా జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో భేటీ అయ్యారు. కొడుకు పెళ్లి శుభలేఖను ఇచ్చేందుకు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చిన ఆమె.. దాదాపు అరగంట పాటు ఉన్నారు.
అనంతరం బయటకు వచ్చిన ఆమెను మీడియా కదలనివ్వలేదు. ఏం మాట్లాడారు? అసలేం జరిగిందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. షర్మిల నుంచి సమాధానాలు కోసం వేసిన ప్రశ్నలకు ఆమె సింఫుల్ గా ఒక్క లైనులో తాను చెప్పాలనుకున్నది చెప్పేసి.. మీడియా ముందు నుంచి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన తర్వాత అర్థమయ్యేది ఒక్కటే. తాను చెప్పాలనుకున్నది మాత్రమే తప్పించి.. అంతకు మించి షర్మిల నుంచి సమాధానాల్ని ఆశించలేమని.
‘‘సీఎం జగన్ గారిని నా కుమారుడు రాజారెడ్డి పెళ్లికి రమ్మని ఆహ్వానించాను. జగన్ సానుకూలంగా స్పందించారు. పెళ్లనేది చాలా ముఖ్యమైన విషయం. అందరూ నా కుమారుడి పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అంటూ చెప్పేశారు. రాజకీయాలు.. మిగిలిన విషయాల్ని వదిలేస్తే.. గతంలో తన సోదరుడి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ జగనన్నా అంటూ మాట్లాడే ఆమె.. తాజాగా మాత్రం ‘సీఎం జగన్మోహన్ రెడ్డి గారు’’ అంటూ పలికిన వైనం చూసినప్పుడు షర్మిల శ్లేష ఇట్టే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డిని తన సోదరుడు అనే కన్నా.. ఏపీ సీఎంగానే ఆమె నోటి నుంచి వచ్చిన మాటలు చూస్తే.. తమ ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.
సోదరుడి మీద ఈగ వాలనివ్వకుండా మాట్లాడే షర్మిల నోటి నుంచి.. సోదరుడన్న మాట సైతం రాకపోవటం చూసినప్పుడు.. తాను చెప్పాలనుకున్నది ఆమె చెప్పేశారని చెప్పాలి. ఆపై ఆమెను మరిన్ని వివరాల్ని అడిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన ఆమె.. పెళ్లి శుభలేఖను సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసిన అనతరం ఆమె గన్నవరం నుంచి డిల్లీకి వెళ్లిపోయారు. కట్ చేస్తే.. మరోవైపు హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. మొత్తంగా ఈ రోజు (గురువారం) దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకోనున్నదన్నది స్పష్టమవుతుంది.