ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు కొనసాగిస్తున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాటల దాడితో రెచ్చిపోతున్నారు. అసలు వైఎస్ పేరును వాడటానికి వీలు లేకుండా జగన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడమే టార్గెట్‌గా షర్మిల అడుగులు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల వైఎస్సార్ 75వ జయంతి జరిగింది. షర్మిల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆ జయంతి వేడుకలను నిర్వహించింది. కానీ వైఎస్ వారసుడినంటూ చెప్పుకునే జగన్ మాత్రం తూతూమంత్రంగా ఆ వేడుకలను నిర్వహించారని షర్మిల ఫైరయ్యారు.
అసలు వైఎస్‌కు జగన్ సొంత కొడుకేనా? సొంత తండ్రి జయంతి వేడుకలను నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్కో సభకు రూ.40 కోట్ల వరకు వెచ్చించిన వైసీపీ.. వైఎస్ జయంతి రోజున ఓ సభ నిర్వహించలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజకీయ వారసురాలిని తానే అని చాటుకోవాలనే లక్ష్యంతో ఏ అవకాశం దొరికినా జగన్‌ను షర్మిల టార్గెట్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఇక ఇప్పుడు వైఎస్సార్ జయంతి వేడుకల రూపంలో షర్మిలకు ఛాన్స్ దొరికిందని అంటున్నారు.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భవిష్యత్‌లో వైఎస్ పేరును జగన్ వాడుకోవడానికి వీలు లేకుండా చేయడమే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తండ్రి జయంతి వేడుకలే నిర్వహించలేని వాళ్లు, తండ్రి పేరును ఎందుకు వాడుకోవాలని పరోక్షంగా షర్మిల ప్రశ్నిస్తున్నట్లే అనుకోవాలి. మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ అభిమానులు, సన్నిహితులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు షర్మిల వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వైఎస్ పేరు చెప్పుకోకుండా జగన్‌ను ఇరకాటంలో నెట్టడమే షర్మిల టార్గెట్‌గా కనిపిస్తోంది.