కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టిపి విలీనంపై కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. రేపో మాపో పార్టీ విలీనం ఖాయమని ప్రచారం జరుగుతున్నా ఆ వ్యవహారం మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ తో భేటీ అయిన షర్మిల..ఆ తర్వాత విలీనం ఎప్పుడు అన్న సంగతి మాత్రం తేల్చలేదు. ఇక, ఇటీవల తెలంగాణలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా పార్టీ విలీనం జరుగుతుందని అంతా అనుకున్నారు.
కానీ, ఇరు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇంకా ఆ వ్యవహారం పెండింగ్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, అసలు కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టిపి విలీనం ఉంటుందా లేదా అన్న వ్యవహారంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో తమ పార్టీ విలీనంపై వైయస్సార్ టిపి అధినేత్రి వైయస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. సెప్టెంబర్ 30వ తేదీ లోపు విలీనంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఒకవేళ విలీనం లేని పక్షంలో ఒంటరిగానే బరిలోకి దిగుతామని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు.
లోటస్పాండ్ లో తెలంగాణలోని అన్ని జిల్లాల వైఎస్ఆర్టిపి నేతలతో సమావేశం అయిన తర్వాత షర్మిల ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక, అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్యలో ఉండే విధంగా షర్మిల ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ విలీనమైనా నేతలు ఆందోళన చెందవద్దని, పార్టీ కోసం శ్రమించిన అందరికీ న్యాయం చేస్తానని షర్మిల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తు లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని షర్మిల చేసిన ప్రకటన తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. ఆల్రెడీ పొత్తు గురించి షర్మిల, సోనియా, రాహుల్ మాట్లాడుకున్నారని, ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయడంపై షర్మిల మాట్లాడడంతో పొత్తు ఉంటుందా లేదా అన్న డైలమాలో వైఎస్ఆర్ టిపి నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.