తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల యాత్రలతోనే ముందుకు సాగేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ నేపథ్యంలో దానికి ఆమె తాత్కాలిక విరామాన్ని ప్రకటించారు.
ఇక ఇప్పుడేమో తాజాగా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రైతు ఆవేదన యాత్రను చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆ రైతుల కుటుంబాలకు చేతనైనంత సాయం చేసి అండగా నిలుస్తామని వెల్లడించారు.
ఆ మైలేజీ కోసం..
ఈ ఏడాది జులై 8న తన తండ్రి వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాష్ట్రంలో రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా ఆమె ప్రజల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
కేసీఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగ సమస్యను తలకెత్తుకుని ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరహార దీక్ష కూడా చేపట్టారు. కానీ ఎన్ని చేసినా ఆమె పార్టీని అధికార టీఆర్ఎస్తో పాటు విపక్షాలు కూడా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తున్నాయి.
దీంతో ఆమె ఆశించిన స్థాయిలో పార్టీకి మైలేజీ రావడం లేదు. పైగా పార్టీలో పేరున్న నాయకుల చేరికల సంగతి పక్కనపెడితే పార్టీలోని కీలక నేతలే ఒక్కొక్కరిగా బయటకు వెళ్తున్నారు.
ఆ పాదయాత్రతో..
ఇక రాష్ట్రంలో తన పార్టీని ప్రజలకు చేరువ చేయాలంటే తన తండ్రి వైఎస్, అన్న జగన్ నడిచిన బాటలోనే సాగాలని షర్మిల నిర్ణయించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు అక్టోబర్ 20న ఆమె ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
సుమారు ఏడాదికిపైగా దాదాపు 4 వేల కిలోమీటర్లు చుట్టేసేలా ఈ పాదయాత్రకు ప్లాన్ చేశారు. 21 రోజుల పాటు ఆరు శాసన సభ నియోజకవర్గాల పరిధిలోని 150 గ్రామాల్లో ఆమె పాదయాత్ర చేశారు. కానీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో దాన్ని గౌరవిస్తూ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎక్కడైతే పాదయాత్ర ఆపారో తిరిగి అక్కడి నుంచే మొదలెడతానని ప్రకటించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రావడం కోడ్ గడువు ముగిసింది. కానీ ఇప్పుడామె ఆ పాదయాత్రను కొనసాగించకుండా మరో యాత్ర చేస్తానని ప్రకటించడం గమనార్హం. తన పాదయాత్రకు ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం అందుకు కారణం కావొచ్చు. అందుకే ఇప్పుడు ప్రధాన అంశమైన రైతులు ఆత్మహత్యల టాపిక్‌ను తీసుకుని యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ యాత్ర అనంతరం తిరిగి ప్రజా ప్రస్థానం పాద యాత్ర చేపడతానని ప్రకటించారు.