తన అన్న జగన్ తో విభేదాల కారణంగానే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టారన్న టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, కేసీఆర్, జగన్ లు వదిలిన బాణమే షర్మిల అని, వారి కనుసన్నల్లోనే షర్మిల పార్టీ పెట్టారని ప్రచారం జరిగింది. అయితే, ఏపీలో కాకుండా తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం ఏమిటని కొందరు విమర్శించారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఏపీ రాజకీయాల్లోకి షర్మిల అడుగు పెట్టబోతున్నారన్న టాక్ వస్తోంది. ఎంపీ రఘురామరాజు కూడా షర్మిల పార్టీ పెట్టబోతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఆ పుకార్లపై వైఎస్ షర్మిల స్పందించారు. ఏపీలోనూ పార్టీ పెడుతున్నారా? అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు షర్మిల ఆసక్తికర సమాధానం చెప్పారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చని, ఏపీలో పార్టీ పెట్టకూడదన్న రూల్ ఏమీ లేదు కదా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఏపీలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాలకు షర్మిల వ్యాఖ్యలు ఊతమిచ్చినట్లయింది.
ఇక, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గట్టు రాంచందర్ రావును వైఎస్సార్ టీపీలోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నకు షర్మిల సూటిగా స్పందించడం చర్చనీయాంశమైంది. ఏపీలో పార్టీ పెడితే ఏమైనా తప్పా అని ప్రశ్నించిన షర్మిల.. ప్రస్తుతం తాను ఒక మార్గాన్ని ఎంచుకున్నానని అన్నారు. ప్రస్తుతానికి అందులో నడుస్తున్నాను అని, భవిష్యత్తులో పార్టీ పెట్టే యోచన ఉందని పరోక్షంగా సంకేతాలిచ్చారు.