ఉనికిని చాటుకునేందుకే అవస్థలు పడుతున్న వైఎస్సార్టీపీ అధ్యక్షుడు షర్మిల ఆరోపణలు, విమర్శల్లో మాత్రం ఎవరినీ వదిలిపెట్టడం లేదు. తాజాగా నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరిపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఇద్దరు ఇద్దరే ఒకే తాను ముక్కలంటు తీవ్రమైన ఆరోపణలే చేశారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏదో సమస్యతో షర్మిల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంతవరకు పార్టీకి కేంద్ర ఎన్నికల కమీషన్ గుర్తింపే దక్కలేదు.
పార్టీ పేరు విషయంలోనే ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. కమీషన్ ఎన్నిసార్లు కొర్రీలు వేస్తున్నా పార్టీ ఎన్నిసార్లు సమాధానాలు ఇస్తున్నా అధికారికంగా కమీషన్ గుర్తింపు మాత్రం ఇంతవరకు రాలేదు. సరే ఈ సమస్య ఇలాగుంటే జనాల్లోకి పార్టీని తీసుకెళ్ళే ఉద్దేశ్యంతో షర్మిల నానా అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ గా ఏదో సమస్యతో జనాల్లో ఉండటానికే ఆమె ప్రయత్నిస్తున్నారు. నిరుద్యోగ సమస్యని, నిరుద్యోగుల ఆత్మహత్య ని, ఉద్యోగాల భర్తీ అని ఏదో సమస్యను టేకప్ చేస్తున్నారు.
ఆ మధ్య ఉద్యోగాల భర్తీ కోసం దీక్ష చేశారు. తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగుల కుటుంబాలకు మద్దతుగా దీక్షలు చేశారు. ఇపుడు షర్మిల ఒకవైపు కేసీయార్ ను మరోవైపు మోడిని ఏకకాలంలో టార్గెట్ చేశారు. తెలంగాణా అభివృద్దికి మోడీ కానీ కేసీయార్ కానీ చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు.
దొంగే దొంగన్నట్లుగా మోడికి సమస్యలను ఏకరవు పెడుతు కేసీయార్ లేఖలు రాయటాన్ని షర్మిల ఎద్దేవా చేశారు. పైకి కేంద్రంపై యుద్ధమని, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కలుస్తున్న కేసీయార్ లోలోపల మాత్రం భాయి భాయి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటే మండిపోయారు.
మోడీ వల్ల దేశానికి, కేసీఆర్ వల్ల తెలంగాణకు ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పిన మోడి, ఇంటికో ఉద్యగం ఇస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజలను మోసం చేయటం తప్ప చేసిందేమీ లేదంటు మండిపడ్డారు. కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు లేకపోయినా ఇద్దరు ఉద్యోగాలను ఇవ్వకపోగా పరిశ్రమలను అమ్మేస్తున్నారంటు ఆరోపించారు.