తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై వైఎస్సార్సీపీ అధినేత్రి వైయస్ షర్మిల సందర్భంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ను నల్లదొర అంటూ బ్రిటిష్ వాడితో పోల్చిన షర్మిల…తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం దళిత బంధు అమలు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోవాలని, మగతనం నిరూపించుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఆమె నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
తాను పర్యటనకు వెళ్లేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరు అంటూ పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, షర్మిలకు మధ్య గొడవ నేపథ్యంలో…వారికి షర్మిల హారతినిచ్చి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ చెప్పినట్లు పోలీసులు వింటున్నారని, తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు . గజ్వేల్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్ తన మాట నిలబెట్టుకోలేదని, దీంతో గజ్వేల్ లో పేదలు గుడిసెల్లో ఉంటున్నారని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ కు సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పరామర్శించేందుకు వెళుతున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
‘‘హుజూరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దళితబంధును అమలు చేసి.. మీ మగతనాన్ని నిరూపించుకోవాలి’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ లో ప్రజలను పరామర్శించేందుకు వెళుతున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు కుంభకర్ణుడి మాదిరిగా కేసీఆర్ నిద్ర లేస్తుంటారని, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలు ఆయనకు గుర్తుకు రారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.