భారత సంతతికి చెందిన పలువురు ప్రపంచంలోని పలు దేశాల్లో కీలక భూమిక పోషించటమే కాదు.. పలు కార్పొరేట్ కంపెనీలకు మార్గదర్శకులుగా వ్యవహరించటం తెలిసిందే. ఆ జాబితాలో మరో పేరు చేరింది. సంపన్న సింగపూర్ లో తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 66 ఏళ్ల ఆర్థిక వేత్త థర్మన్ షణ్ముగరత్నం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆయన ఘన విజయాన్ని సాధించారు.
ఎన్నికల్లో దాదాపు 70 శాతానికి పైగా ఓట్లు ఆయనకు దక్కటం విశేషంగా చెప్పాలి. పోలింగ్ లో పోలైన 20.48 లక్షల ఓట్లలో మాజీ మంత్రి షణ్ముగరత్నంకు మద్దతుగా 70.4 శాతం ఓట్లు పడ్డాయి. ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన చైనా సంతతికి చెందిన అభ్యర్థులకు వరుసగా 15.7, 13.8 శాతం ఓట్లు పోలైనట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. దీంతో.. భారత మూలాలు ఉన్న షణ్ముగరత్నం సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
సింగపూర్ కు గతంలోనూ భారత మూలాలు ఉన్న నేతలు దేశాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ కోవలో షణ్ముగం మూడో వ్యక్తిగా నిలుస్తారు.
గతంలో సింగపూర్ దేశాధ్యక్షులుగా భారత సంతతికి చెందిన ఎస్. రామనాథన్ (తమిళనాడు మూలాలు), దేవన్ నాయర్ (కేరళ మూలాలు) లు పని చేశారు. షణ్ముగరత్నం మూడో వ్యక్తిగా నిలుస్తారు. ఎన్నికల ప్రచార దశ నుంచే తనను సింగపూర్ ప్రజలు అధ్యక్ష కుర్చీలో కూర్చోబెడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసేవారు. అందుకు తగ్గట్లే ఆయన ఘనవిజయాన్ని సొంతం చేసుకోవటం విశేషం. 2011 తర్వాత సింగపూర్ లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత జరిగిన ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న నేత గెలుపొందటం ఆసక్తికరంగా మారింది.
దాదాపు ఇరవై ఏళ్లుగా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీలో పలు మంత్రి పదవులు చేపట్టిన ఆయన.. ఉప ప్రధానిగా పని చేయటం కలిసి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా జులైలో ఆయన తనకున్న అన్నీ పదవులకు రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగారు. ప్రస్తుతం సింగపూర్ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న హలీమా యాకోబ్ పదవీ కాలం సెప్టెంబరు 13తో ముగియనుంది. ఈ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగుతారు. తాజా ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన షణ్ముగాన్ని సింగపూర్ దేశ ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందలు తెలిపారు. ప్రధాని లీ సారథ్యంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ ఈ ఎన్నికల్లో షణ్ముగానికి అండగా నిలవటంతో ఆయన విజయం మరింత సునాయాసమైంది.
షణ్ముగ రత్నం విషయానికి వస్తే.. అంచలంచెలుగా ఎదిగిన క్రమం కనిపిస్తుంది. సింగపూర్ తొమ్మిది అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన 2011 నుంచి 2019 వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా వ్యవహరించారు. 2019-2023 మధ్య కాలంలో సీనియర్ మంత్రిగా కేబినెట్ విధుల్ని నిర్వర్తించిన ఆయన.. ప్రముఖ ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా మంచి పేరుంది. సింగపూర్ లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957లో జన్మించిన షణ్ముగం.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పట్టా పొంది.. తర్వాత కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీని సొంతం చేసుకున్నారు.
అనంతరం హార్వర్డ్ వర్సిటీ నుంచి మాస్టర్ పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్ చేశారు. ఫాదర్ ఆఫ్ ఫాథాలజీ ఇన్ సింగపూర్ పేరున్న వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ షణ్ముగరత్నం కొడుకే థర్మన్ షణ్ముగరత్నం కావటం గమనార్హం. స్థానిక న్యాయవాది యుమికో ఇట్టోగిని ఆయన పెళ్లి చేసుకున్నారు.