బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు రావడం, ఆ కేసులో సిట్, ఈడీ అధికారులు విచారణ జరపడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక, బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతితో బాలీవుడ్ లో డ్రగ్స్ తేనె తుట్టె కదలడం అప్పట్లో ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో బాలీవుడ్ బాద్షాహ్ షారుక్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ పేరు రావడం హాట్ టాపిక్ గా మారింది.
ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్లో జరుగుతున్న రేవ్ పార్టీపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు పక్కా ప్రణాళికతో దాడి చేశారు. ఆ పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను, నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో, ఆర్యన్ ఖాన్ కూడా ఉండడంతో షారుక్ అభిమానులు షాకయ్యారు. ఆర్యన్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు అతడి కాల్ డేటా, చాట్స్‌ను పరిశీలిస్తున్నారు.
అయితే, గోవాలో ఈ పార్టీ గురించి టిప్ రావడంతో ముంబైలో డ్రగ్స్ రాకెట్ డొంక కదిలిందని తెలుస్తోంది. దీంతో, ఎన్సీబీ అధికారులు…పక్కా స్కెచ్ వేసి అండర్ కవర్ ఆపరేషన్ చేసి పార్టీని భగ్నం చేశారు. ఈ డ్రగ్స్ పార్టీ సూత్రధారి ఎఫ్‌టీవీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఖాషిఫ్ ఖాన్ అని తెలుస్తోంది. అతడిని కూడా అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై షారుక్ స్పందించలేదు.