ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం జరిగితే పోలీసులను తర్వాత న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తారు. అక్కడ తమ గోడు చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తారు. అయితే.. వైసీపీ పరిస్థితి దీనికి కూడా పనికిరాకుండా పోయిందనే చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో అభ్యంతకర, అసహ్యకర పోస్టులు పెడుతున్నారం టూ.. వైసీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ కార్యకర్లను ఏపీ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. విచారణ సాగిస్తున్నారు. అయితే.. ఇవన్నీ అక్రమ కేసులేనని వైసీపీ పేర్కొంటోంది.
ఈ క్రమంలోనే ఆ పార్టీ పట్ల విధేయత ప్రదర్శించే జర్నలిస్టే విజయబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అక్రమాలకు ఒడిగడుతున్నారని.. అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని.. భావప్రకటనా స్వేచ్ఛ పై దాడి చేస్తున్నారని పేర్కొంటూ.. ఆయన హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిలో ఇటీవల జరిగిన అరెస్టులు.. వైసీపీ సానుభూతిపరుల వ్యవహారాలను వివరించారు. అయితే.. ఈ పిటిషన్పై హైకోర్టు సానుకూలంగా స్పందిస్తుందని అనుకున్నా.. విషయం రివర్స్ అయిపోయింది.
విజయబాబు దాఖలు చేసిన `పిల్`పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాను భావ ప్రకటనా స్వేచ్ఛగానే పేర్కొంటూ.. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని నిలదీసింది. అంతేకాదు.. ఈ సమయంలో గతంలో హైకోర్టు తీర్పులను వ్యాఖ్యానిస్తూ.. న్యాయమూర్తులను కూడా దూషించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. “అప్పుడు ఏమైంది?“ అని నిలదీసింది. సమాజానికి ఇలాంటి వారు పెద్ద సవాలుగా పరిణమించారని పేర్కొంది.
ఇలాంటివి ప్రజాప్రయోజన వ్యాజ్యాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అయితే.. బాధితులే నేరుగా తాము ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తూ కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు కేసులను పరిగణనలోని తీసుకుంటామని స్పష్టం చేసింది. అంతకు మించి.. ఇలాంటి కేసుల్లో హైకోర్టు జోక్యం చేసుకునేది లేదని పేర్కొంది. అంటే.. మొత్తంగా వైసీపీని ఇప్పుడు న్యాయ వ్యవస్థ కూడా కాపాడలేని పరిస్థితి ఏర్పడినట్టు అయిందని న్యాయవాదులు సైతం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.