ఒకరు తర్వాత ఒకరు. ఏదో అర్జెంట్ పని ఉన్నట్లుగా.. ఎవరో పిలిస్తే.. వస్తున్నా.. అంటూవెళిపోతున్నట్లుగా ఒకరు తర్వాత ఒకరు చొప్పున తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు ఇటీవల వెళ్లిపోతున్న వైనం షాకింగ్ గా మారింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ పరమపదించి రోజు గడిచిందో లేదో తాజాగా మరో విషాదం సినిమా ఇండస్ట్రీని కమ్మేసింది. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం (79) కన్నుమూశారు.
చెన్నైలో నివాసం ఉండే ఆమె ఈ రోజు కన్నుమూసినట్లుగా ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. చెన్నైలోని నాగంబాక్కంలో గల హద్డౌస్ రోడ్డులో ఆమె నివాసం ఉంది. తెలుగు.. తమిళం.. హిందీ.. మలయాళ.. గుజరాతీ.. మరాఠీ.. ఒరియా.. భోజ్ పురీ ఇలా ఏకంగా పద్నాలుగు భాషల్లో ఏకంగా 20 వేలకు పైగా పాటలు ఆలపించిన ఆమె ఈ రోజున తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సినీ పరిశ్రమతో పాటు.. సినీ అభిమానులకు షాకిచ్చారు.
తెలుగునాట సుశీల.. జానకి లాంటి గాయనీమణుల హవా నడుస్తున్న వేళ.. ఒక ప్రత్యేకమైన గొంతుతో పరిచయమై.. ఆ తర్వాత సుపరిచితమైన గాయని వాణీ జయరామ్. సంగీత ప్రధానమైన పాటను పాడించాలంటే ఆమెకు సాటి వచ్చే వారెవరూ ఉండరు. అందుకే.. ఆమె కోసం.. ఆమె టైం కోసం చాలామంది వెయిట్ చేసిన సందర్భాలెన్నో. ఆమె గాన ప్రతిభకు గుర్తింపుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. ఆ పురస్కారాన్ని తీసుకోకుండానే ఆమె వెళ్లిపోవటం వేదనకు గురి చేస్తోంది.
వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. ఎనిమిదో సంతానంగా జన్మించిన ఆమెకు చిన్నతనంలోనే బాలమేధావిగా పేరుంది. కేవలం ఎనిమిదేళ్ల వయసులోనే ఆలిండియా రేడియో కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. కర్ణాటక సంగీతాన్ని కడలూరు శ్రీనివాస్ అయ్యంగార్, టీఆర్ బాలసుబ్రమణియన్, ఆర్ ఎస్ మణిల మధ్య అభ్యసించారు. హిందుస్తానీ సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద అభ్యసించారు.
వాణీ జయరాం తొలిసారి పాట పాడే అవకాశం గుడ్డీఅనే చిత్రంలో బోలేరే పాటకు వచ్చింది. దానికి తాన్ సేన్ తో పాటు మరో నాలుగు అవార్డులు వచ్చాయి. అలా మొదలైన ఆమె సినీ ప్రయాణం.. తక్కువ కాలంలోనే ఆమె పాటలు ఒక ప్రవాహంలా మరాయి. ప్రత్యేక గొంతు కావాలనుకున్న వారికి వాణీ మొదటి ప్రాధాన్యతగా ఉండేవారు. తెలుగు ప్రేక్షకులకు ఆమెను పరిచయం చేసింది కోదండపాణి. అభిమానవంతుడు అనే మూవీలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ పాటను ఆమె ఆలపించారు. శంకరాభరణం మూవీలో పాటలకు ఆమెకు జాతీయ అవార్డు రెండోసారి పొందగా.. స్వాతికిరణంలోనిఆనతి నియ్యరా హరా పాటకు మూడోసరి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె భర్త 2018లో కన్నుమూశారు. వారికి సంతానం లేదు.