యువగళం పేరుతో 4 వేల కిలో మీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ .. యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే యువత కేంద్రంగా ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను తీసుకురానున్నట్టు చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు తాము విశేష కృషి చేయనున్నట్టు వివరించారు. తాజాగా ఆయన యువగళం పాదయాత్రలో భాగంగా యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
‘‘యువతకు హామీ ఇస్తున్నా.. త్వరలోనే యువతకు ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకు రాబోతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని? ప్రైవేటు రంగం నుంచి ఎన్ని? స్వయం ఉపాధి ద్వారా ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామో స్పష్టంగా అందులో ప్రకటిస్తాం. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం“ అని లోకేష్ స్పష్టం చేశారు. అదేవిధంగా కౌలు రైతులకు ప్రత్యేక కార్యాచరణ తీసుకొచ్చి ఆదుకుంటామన్నారు.
చీరలు-గాజులు పంపిస్తారా?
మరోవైపు వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపైనా నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ వైఫ్యలాలను విమర్శిస్తే.. తనకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారని, వాటిని పంపించాలని సవాల్ రువ్వారు. వైసీపీ మంత్రి ఇచ్చే చీర, గాజులు.. టీడీపీని అభిమానించే అక్కలు, చెళ్లెల్లకు ఇస్తామని లోకేష్ ప్రకటించారు. చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్లు చేతగానివాళ్లా? అని ప్రశ్నించారు. జగన్ మాదిరిగా తల్లీ, చెల్లిని బయటకు గెంటలేదని నిప్పులు చెరిగారు.
మంత్రి పదవిలో ఉన్న వాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని లోకేష్ హితవు పలికారు. ఏ1 తెచ్చిన జీవో1తో యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, పవన్ వారాహి వాహనానికి ఆంక్షలు పెడుతున్నారని, అయినప్పటికీ యువగళం, వారాహి యాత్రలు ఆగబోవని స్పష్టం చేశారు. అడ్డొస్తే తొక్కుకుని వెళ్లి పోతామని వ్యాఖ్యానించారు. “400 రోజుల పాదయాత్రలో ఇది తొలిరోజు. నిరుద్యోగ యువతకు పిలుపినిస్తున్నా.. కలిసికట్టుగా ఉద్యమించి జాదూరెడ్డిని ఇంటికి పంపిద్దాం’’ అని లోకేశ్ అన్నారు.