ఏపీలో రాజకీయ నేతలకు కొదవ లేకున్నా.. డొక్క శుద్ధి ఉండి.. విషయాల మీద అవగాహన ఉన్నవారిని వేళ్ల మీద లెక్క పట్టే అవకాశం ఉంది. అలా లెక్కించే టాప్ పది మందలో ఒకరు మాజీ ఎంపీ సబ్బం హరి. చాలా మంది నేతలకంటే భిన్నంగా వ్యవహరించే సబ్బం హరి… మాటలకు చాలావరకు క్రెడిబులిటీ ఉంది. ఇపుడు ఆయన షర్మిల గురించి సంచలన విషయం వెల్లడించారు.
ఈ మధ్యన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్త పార్టీ పెట్టనున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. అయితే.. అదేమీ సరికాదంటూ ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసిన ఆమె.. నిరాధారమైనవని పేర్కొన్నారే తప్పించి.. పార్టీ పెట్టటం ఏమిటి? అంటూ కడిగేసినట్లుగా మాట్లాడలేదు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపైన తాజాగా సబ్బం హరి గళం విప్పారు. సంచలన అంశాల్ని వెల్లడించారు.
2014 ఎన్నికల సమయంలోనే అన్నాచెల్లెళ్ల మధ్య అగాథం ఏర్పడిందని.. ఈ దూరం వల్లే షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. పార్టీని ఇప్పటికే రిజిస్టర్ చేశారని.. ముహుర్తం కూడా ఖరారైందని వెల్లడించారు. వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వారితో ఆమె భర్త అనిల్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పటం హాట్ టాపిక్ గా మారింది.
ఒక చానల్ తో మాట్లాడిన సబ్బం.. 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా తొలుత షర్మిలను నిలబెట్టాలని భావించారని..కానీ అనివార్య కారణాలతో విజయమ్మను నిలిపారన్నారు. అప్పటినుంచే అన్నాచెల్లెళ్ల మధ్య దూరం పెరిగినట్లు చెప్పారు. వైఎస్ కుటుంబం గురించి గతంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఎంతో మంది.. పవర్లోకి వచ్చాక పదవులు పొంది అధికారాన్ని అనుభవిస్తుంటే.. పార్టీ కోసం కష్టపడిన తన బిడ్డ షర్మిల అధికారంలో భాగస్వామ్యం కాకపోవటంపై విజయమ్మ ఆగ్రహంతో ఉన్నారన్నారు.
అయితే.. షర్మిల పార్టీ పెడితే.. కుటుంబ పరువు బజారున పడకుండా ఉండేందుకు మధ్యే మార్గంగా విజయమ్మ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జగన్ కు..షర్మిలకు మధ్య దూరం పెరగటానికి సరైన కారణం చెప్పని తీరుకు భిన్నంగా సబ్బం హరి మాటలు ఉండటంతో ఇటీవల వచ్చిన కథనాల్లో నిజం ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.