సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వు లు జారీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 2022 ఫిబ్రవ రి 8 నుంచి ఆయన సర్వీసు పునరుద్ధరణ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఏబీ వెంకటేశ్వరరావు..రిపోర్ట్ చేసే వరకు వెయిటింగ్ పిరియడ్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో రెండేళ్లుగా ఎదురు చూస్తున్న ఏబీకి సానుకూల సంకేతం వచ్చినట్టు అయింది.
విఫలమైన వైసీపీ ప్రయోగం!
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకు న్నారని దాఖలైన అభియోగాలపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను విధుల్లోంచి తొలగించింది. భద్రతా ఉపకరణాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయని.. ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావు 1989 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు.
జాతీయ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించేలా ఓ విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థకు పోలీసు సెక్యూరిటీ ప్రోటోకాల్ వ్యవస్థ వివరాలను అప్పగించారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థతో వెంకటేశ్వరరావు కుమ్మక్కయ్యారని… నిబంధనలకు వ్యతిరేకంగా నిఘా ఉపకరణాలు కొనుగోలు చేశారని ఆయనపై మోపిన అభియోగాల్లో ప్రభుత్వం పేర్కొంది.
అంతేకాదు.. వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్సాయికృష్ణకు చెందిన సంస్థ ద్వారా అత్యంత కీలకమైన నిఘా పరికరాలను, వ్యవస్థలను కొనుగోలు చేశారని మరో నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. ఆయన కుమారుడి సంస్థ నుంచే పోలీసులు వినియోగించే కీలకమైన నిఘా పరికరాలను కొనుగోలు చేయించటం అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలీసులు వినియోగించే అత్యంత కీలకమైన ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్ ఉపకరణాలను ప్రైవేటు వ్యక్తులు, విదేశీ రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ చేతుల్లో పెట్టటం ద్వారా… జాతీయ భద్రతకు తీవ్ర విఘాతం కలిగించారని ప్రభుత్వం తన నివేదికలో వివరించింది.
అయితే.. దీనిపై న్యాయ పోరాటం చేసిన ఏబీకి సుప్రీం కోర్టులో ఇటీవల ఊరట లభించింది. సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ)ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడం కుదరదని పేర్కొంది. ఏబీవీని మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు జస్టిస్ ఏ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.
మళ్లీ కోర్టుకు వెళ్తారనే..
సుప్రీం కోర్టు ఆదేశాలు వచ్చి కూడా దాదాపు నెల అవుతోంది. అయినప్పటికీ.. ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను పట్టించుకోలేదు. ఇప్పటికే పలుమార్లుతనకు పోస్టింగు ఇవ్వాలంటూ.. సుప్రీం ఆర్డర్లతో ఏబీ.. సీఎస్‌ను కలిసేందుకు వెళ్లారు. అయితే.. ఆయనకు సీఎస్.. అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక, విసిగి వేసారిన ఆయన త్వరలోనే మళ్లీ కోర్టు తలుపులు తట్టేందుకు రెడీ అవుతున్నారనే సంకేతాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తేస్తూ.. ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.