కొన్నిపాత్రలకు కొందరు మాత్రమే సూట్ అవుతారు. ఇంకెవరు చేసినా ఆ పాత్రలకు నిండుతనం రాదు. అలాంటి ఇమేజ్ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో సీనియర్ నటి జయంతి (76) ఒకరు. గడిచిన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమెను ఆదివారం రాత్రి శ్వాస తీసుకోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో.. ఆమెను ఇంటి నుంచి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు (సోమవారం) ఉదయం తుదిశ్వాస విడిచారు. మూడు దశాబ్దాలుగా ఆమె ఆస్తమాతో బాధ పడుతున్నారు.
దక్షిణాది భాషల్లో నటించిన జయంతి సినీ ప్రియులకు సుపరిచితులు. ఆమె మరణం పట్ల తెలుగు.. తమిళ..కన్నడ చిత్రపరిశ్రమలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. ఒకప్పటి తెలుగు ప్రాంతం..ప్రస్తుతం కర్ణాటకలో భాగమైన బళ్లారిలో జయంతి 1945లో జన్మించారు.
‘జెనుగూడు’ అనే కన్నడ చిత్రంలో నటిగా 1963లో సినీ రంగప్రవేశం చేసిన ఆమె.. బహుభాషా చిత్రల్లోనటించారు. తెలుగు.. కన్నడ.. తమిళం.. మలయాళం.. హిందీ.. మరాఠీ భాషల్లో సుమారు 500లకు పైగా సినిమాల్లో నటించిన ఆమె గడిచిన కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రత్యేక రిక్వెస్టు మీద మాత్రమే కాదనలేక సినిమాలు చేస్తున్నారు.
కొండవీటి సింహం.. బొబ్బిలి యుద్ధం.. పెదరాయుడు చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకునేవారు. విషాద పాత్రలు.. కష్టాల కడగండ్లలో కూరుకుపోయినట్లు ఉండే పాత్రల్లో జీవించే ఆమె.. తన నటనతో ప్రేక్షకుల్ని విపరీతమైన భావోద్వేగానికి గురి చేస్తారన్న పేరుంది.
మిగిలిన నటీమణులకు భిన్నమైన కంఠస్వరం.. వాయిస్ లో బేస్ ఎక్కువని చెప్పాలి. కొమ్ములు తిరిగిననటులు సైతం ఆమె డైలాగుల ముందు వారి స్వరం తేలిపోయేది. అలాంటి స్వరం ఆమెకు మాత్రమే సొంతం.
ఎన్టీఆర్ తో పాటు సీనియర్ నటీనటులతో కలిసి నటించిన జయంతి.. పలు కీలక పాత్రలు పోషించారు. కరోనాకు ముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమాలోనూ జయంతి నటించారు.
తెలుగులో భార్యభర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి.. జగదేక వీరుడి కథ.. డాక్టర్ చక్రవర్తి.. జస్టిస్ చౌదరి.. దొంగమొగుడు..కొదమ సింహం.. పెదరాయుడు తదితర సినిమాల్లో నటించారు. తల్లి పాత్రలతో జీవించే ఆమె లేని లోటు చిత్రపరిశ్రమను ఎప్పటికి వెంటాడుతూనే ఉంటుంది.