కశ్మీర్ ఫైల్స్ సినిమా మంచి ఫలితాలను నమోదు చేసిందని బీజేపీ సంబరపడుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా తనదైన శైలిలో ట్రిపుల్ ఆర్ ఎంచుకుంది.దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నింటినీ వదిలి సినిమాల ఆధారంగా మాట్లాడడం వాటిని ఆధారంగా చేసుకుని రాజకీయం చేయాలనుకోవడం గత కొద్ది రోజులుగా నడుస్తున్న పరిణామాలకు తార్కాణం. పేరుకు జాతీయ పార్టీలే అయినప్పటికీ అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం పై పెద్దగా ఫోకస్ లో లేవని కూడా అంటున్నాయి ఇంకొన్ని వర్గాలు.
చాలా రోజులకు ఓ సినిమా రాజకీయాలకు కేంద్ర బిందువు అవుతోంది. చాలా రోజులకు ఓ సినిమా వివాదాలను నెత్తిన వేసుకుని ప్రదర్శితం అవుతోంది. అదే కశ్మీర్ ఫైల్స్. ఇదే సందర్భంలో రాజకీయాలకు దూరంగా ఉండే రాజమౌళి సినిమాను సైతం ఇందులో లాగుతున్నారు. ఐక్యత సమగ్రత సౌభ్రాతత్వం అనే మూడు అంశాలపై ఆధారపడి ఓ కల్పిత గాథగానే తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ చిత్రం కాంగ్రెస్ నాయకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.
అదే సమయంలో బీజేపీ కౌంటర్లు ఇచ్చేందుకు ట్రిపుల్ ఆర్ సినిమానే సరైందని కూడా భావిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల అంచనాలను అందుకుని ఫుల్ జోష్ లో వెళ్తున్న ట్రిపుల్ ఆర్ రిజల్ట్ ను ఓ విధంగా కాంగ్రెస్ సొంతం చేసుకోవాలని తద్వారా పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని యోచిస్తుందా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి బీజేపీ గూటి నుంచి..!
ఇటీవల విడుదలయి విజయం సాధించిన ట్రిపుల్ ఆర్ ఇప్పుడొక రాజకీయ వివాదంలో ఇరుక్కుంది. సినిమాకు సంబంధించి అనూహ్య స్పందన వస్తున్నా కూడా గతం కన్నా భిన్నంగా ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు దీనిని తమ సొంతం చేసుకుని మాట్లాడేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.ఇదే కోవలో కాంగ్రెస్ కూడా చేరింది. ఇప్పటికే బీజేపీ నాయకులు కశ్మీర్ ఫైల్స్ సినిమాను సొంతం చేసుకుని, పన్ను మినహాయింపు కూడా ఇచ్చిన సందర్భంలో ఈ వ్యవహారం కాంగ్రెస్ వెర్సస్ బీజేపీ అన్న విధంగా తయారైంది.
ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ సినిమా పై ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రశంసలు గుప్పించారు. ఓ దేశం ఐక్యంగా ఉండాలంటే ట్రిపుల్ ఆర్ సినిమా చూడాల్సిందేనని అన్నారు. ఇదే సందర్భంలో కశ్మీర్ ఫైల్స్ సినిమా పై కోపం అయ్యారు. ఇంతకూ వివాదానికి కారణం ఏంటో చూద్దాం. ముందుగా కశ్మీర్ ఫైల్స్ ను ఓన్ చేసుకున్న బీజేపీ ఇందులో తమకు అనుకూలం అయిన విషయాలు ఉన్నాయి అని గ్రహించి కశ్మీరు పండిట్ల వేదనకు అద్దం పట్టిన సినిమా ఇది అని పేర్కొంటూ ఓ మతవాద రాజకీయం నడిపింది. దీనికి కౌంటర్ ఇవాళ సీతక్క ఇవ్వడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.