తెలంగాణాలో రాజకీయం చాలా విచిత్రంగా మారిపోతోంది. కేసీయార్ ను అధికారంలో నుంచి దించటమే టార్గెట్ గా ఇకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ చాలా స్పీడుగా రాజకీయం చేస్తున్నాయి.
కేసీయార్ పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న డిమాండ్ ఇందులో బాగమే.
పైగా డిమాండ్ తో ఆగకుండా పార్టీలోని జిల్లాల అధ్యక్షులతో కేసీయార్ పై రాజద్రోహం కేసు నమోదు చేయాలంటు వివిధ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేయిస్తున్నారు.
ఇంతకీ కేసీయార్ మీద రాజద్రోహం కేసు ఎందుకు నమోదుచేయాలి ? ఎందుకంటే రాజ్యాంగాన్ని తిరగ రాయాలని డిమాండ్ చేసినందుకట.
ఆమధ్య కేసీయార్ మాట్లాడుతు రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సిన అవసరం వచ్చిందన్నారు.
ఇప్పటికి చాలాసార్లు సవరణలు చేశారు కాబట్టి ప్రస్తుత దేశ అవసరాలకు తగ్గట్లుగా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తన డిమాండ్ పై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కూడా కేసీయార్ కోరుకున్నారు.
నిజానికి కేసీయార్ డిమాండ్ లో తప్పేమీలేదు. ఎందుకంటే రాజ్యంగానికి చాలాసార్లు సవరణలు చేసినపుడు ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా ఎందుకు పునరచించకూడదనేది కేసీయార్ డిమాండ్.
ఇందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీయార్ ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని రచించింది దళితుడైన అంబేద్కర్ కాబట్టి కేసీయార్ దిమాండ్ దళితులను అవమానించటమేనట.
రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న కేసీయార్ డిమాండ్ కు దళితులకు ఏమన్నా సంబంధముందా ? తిరిగి రాయలనటమే తప్పయితే మరి సవరణలు చేయటం కూడా తప్పే కదా. ఏ దేశమైనా తన రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్లుగా మార్చుకోవటం తప్పెలా అవుతుంది ? డిమాండ్ చేసింది తెలంగాణా ముఖ్యమంత్రి. ఆమోదించాల్సింది కేంద్ర ప్రభుత్వం. మధ్యలో బీజేపీ, కాంగ్రెస్ కు సమస్య ఏమిటో అర్ధం కావటంలేదు.
కేసీయార్ ప్రతిమాటను, డిమాండ్ ను రాజకీయంగా మార్చేసుకుని లబ్దిపొందుదామనే బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. మరి చివరకు ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.