గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడడం.. అక్కడ ఫర్నిచర్ సహా పార్కింగ్‌లో ఉన్న కార్లను ధ్వంసం చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా వైసీపీ నేతల పనేనని వారు ఆరోపించారు. అయితే.. ఈ పరిణామాలతో పోలీసులు ఏం చేయాలి? మరోసారి ఇలాంటి గొడవలు జరగకుండా.. చర్యలు తీసుకోవాలి. అదేసమయంలో టీడీపీ నేతలకు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. వీటినే టీడీపీ నాయకులు ఆకాంక్షించారు.
కానీ, దీనికి భిన్నంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారని అంటున్నారు టీడీపీ నాయకులు.. టీడీపీ నేతలనువ దిలేసి.. వారి కార్యాలయాలను కూడా వదిలేసి..ఏకంగా పోలీసు బాస్ కార్యాలయానికి పోలీసులు భద్రత పెంచారని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయం వరకు సర్వీసు రోడ్డు-జాతీయ రహదారి మధ్య ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.
సర్వీస్ రోడ్డులో మూడంచెల బారికేడ్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు. సర్వీసు రోడ్డులోకి రాకుండా వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. డీజీపీ కార్యాలయ పరిసరాలంతా పోలీసులు వలయాన్ని ఏర్పాటు చేశారు. అరెస్టు చేసి తరలించే వాహనాలు, అదనపు బలగాలు మోహరించారు. పోలీసు చర్యలతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు సైతం తప్పుబట్టారు. తాజాగా ఆయన పార్టీ శ్రేణులతోనూ ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. ఎవరూ ఉద్రేకాలకు లోను కావొద్దని ఆయన పిలుపునిచ్చారు.