ప్రధాన మీడియాలో కనిపించని ఒక వార్తాంశం వాట్సాప్ గ్రూపుల్లో హడావుడి చేసింది. ఆసక్తికర అంశం కావటంతో మీడియా సర్కిల్స్ లో ఇది కాస్తంత హడావుడి చేసింది. అధికారిక సమాచారం కానప్పటికి.. అనధికారికంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
కారణం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం బయటకు పొక్కింది.అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఢిల్లీలోని పలువురితో మంతనాలు జరపనున్నట్లు చెబుతున్నారు.
పలువురు కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా హోం మంత్రి అమిత్ షా.. రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు.. మరికొందరితోనూ ఆయన భేటీ అవుతారని సమాచారం. ప్రధాని మోడీని కలిసే వీలు ఉందని చెబుతున్నా.. ఎంతవరకు సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రస్తుతం తమ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామ రాజు వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చగా మారుతోంది. ఒక క్రమపద్దతిలో రోజుకో సంచనలానికి తెర తీస్తున్నారు. రాజద్రోహం కేసులో అరెస్టు అయి.. ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందన్న ఆరోపణలతో సుప్రీంకోర్టును ఆశ్రయించటం.. అక్కడ బెయిల్ రావటం తెలిసిందే.
దీంతో.. సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో మరింత మెరుగైన వైద్యానికి వెళ్లారు. ఆ తర్వాత నుంచి కేంద్రమంత్రి రాజ్ నాథ్ తోనూ.. పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాతోనూ.. జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు.. తనకు జరిగిన దాని గురించి లేఖలు రాయటం.. ఒకటి తర్వాత ఒకటిగా ఆయన వేస్తున్న అడుగులు ఏపీ ప్రభుత్వం మీద కొత్త ఒత్తిడిని తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు.
తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగంలో బాధ్యులుగా చెప్పే వారిపై చర్యలతో పాటు.. తాను మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేళ.. తనను అరెస్టు చేసేందుకు గుంటూరు రూరల్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రయత్నించారంటూ ఆరోపించి సంచలనంగా మారారు.
అనూహ్యంగా అమ్మిరెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం వెలువడటం తెలిసిందే. ఇలా అనూహ్య పరిణామాలకు తెర తీస్తున్న రఘురామ ప్రభావం జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఉందన్న మాట వినిపిస్తోంది.
అయితే.. ఈ వాదనలో నిజం లేదని.. వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉండటం.. గ్లోబల్ టెండర్ల కోసం ప్రయత్నిస్తే ఫలితం లేకపోవటంతో కేంద్రంతో ఈ విషయం మీద మాట్లాడేందుకు వెళ్తున్నారని వైసీపీ నేతలు కవర్ చేస్తున్నారు.
మరోవైపు జగన్ బెయిల్ రద్దు కేసు అంశం తరచూ తెర మీదకు వస్తున్న వేళ.. ఆయన ఢిల్లీ వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.