ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణపై సర్వత్రా ఆసక్తి ఏర్పడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల నుంచి ఈ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సునీల్ యాదవ్ ను విచారణ జరుపగా…ఈ కేసులో మరింతమంది పేర్లు తెరపైకి వచ్చాయని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు మరో అనుమానితుడిని అరెస్టు చేశారు. గజ్జల ఉమాశంకర్‌రెడ్డి (45)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు….అతడిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఉమా శంకర్ కు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా… కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులు కీలక నిందితుడిగా సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు పరిగణిస్తుండగా…తాజాగా ఉమా శంకర్ పేరు తెరపైకి వచ్చింది.
సునీల్ యాదవ్ బంధువు భరత్‌కుమార్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను సుదీర్ఘంగా విచారణ జరిపిన అధికారులు …ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ను 5 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ పిటిషన్ వేసినట్లు తెలిసింది. వివేకా హత్యకేసులో ఉమాశంకర్ పాత్రపై సునీల్, డ్రైవర్ దస్తగిరి కీలక సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సునీల్, ఉమా శంకర్ లదే కీలక పాత్ర అని ప్రచారం జరుగుతోంది.
వివేకా హత్యకు ముందే రెక్కీ నిర్వహించి…ఆ తర్వాత ఇంట్లోని కుక్కను సునీల్, ఉమాశంకర్ లు కారుతో ఢీకొట్టి చంపినట్లు ప్రచారం జరుగుతోంది. బైకుపై వెళ్లిన సునీల్, ఉమా శంకర్ లు హత్య చేసి పారిపోయారని తెలుస్తోంది. ఉమాశంకర్ బైకులో గొడ్డలి పెట్టుకుని పారిపోయాడని, ఆ బైకు, గొడ్డలిని సీబీఐ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. గుజరాత్ నుంచి ఫోరెన్సిక్ నివేదిక తెప్పించారని, గత నెల 11న ఉమాశంకర్ ఇంట్లో రెండు చొక్కాలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది.
అంతేకాదు, ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని పట్టుకోవాల్సి ఉందని, హత్యకు వాడిర ఇతర ఆయుధాలనూ స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఉమాశంకర్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరనుందని తెలుస్తోంది. అయితే, ఈ కేసులో పెద్దవాళ్ల హస్తం ఉందని, వారిపేర్లు తెరపైకి రావడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరి, ఉమా శంకర్ అరెస్టుతో వారి పేర్లు బయటకు వస్తాయో లేదో చూడాలి.