తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక పూర్తయినా సరే అది రాజేసిన రాజకీయ వేడి మాత్రం ఇప్పట్లో చల్లారేలాలేదు. నల్గొండ జిల్లాలో మంచి పట్టున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుున్నారు. అందులోనూ, మొన్నటిదాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడం, అదే సమయంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా కాంగ్రెస్ ఎంపీ గానే కొనసాగడంతో మునుగోడులో అన్నదమ్ముల సవాల్ ఆసక్తి రేపింది.
అయితే, సవాల్ మాట పక్కనెబట్టిన వెంకట్ రెడ్డి…కనీసం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం కూడా చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. అంతేకాదు, ఈ ఉప ఎన్నికలో ఈసారి కాంగ్రెస్ ఓటమి ఖాయమని, అందుకే, తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కొంతమంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసినట్టుగా ఆరోపణలు రావడం, ఆ ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడం సంచలనం రేపింది.
ఈ వ్యవహారం నేపథ్యంలోనే గతంలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం…. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, ఆ నోటీసులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డందుకు వెంకట రెడ్డి పై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ తాజాగా వెంకటరెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ మరో షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
అంతకుముందు, తన ఆడియో లీక్ అయిన మరుక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఇక, అక్కడ తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారితోనూ కాంగ్రెస్ ఎలాగూ గెలవదు, అందుకే తాను ప్రచారానికి వెళ్లడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే గత నెల 22న వెంకటరెడ్డికి ఏఐసిసి షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దానికి వెంకటరెడ్డి స్పందించకపోవడంతో తాజాగా రెండోసారి షో కాజ్ నోటీసు జారీ చేయడం సంచలనం రేపుతోంది.