ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ రంగులను ప్రభుత్వ ఆస్తులన్నింటికీ అద్దేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తరచుగా వివాదాస్పదం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ప్రభుత్వ భవనాలన్నింటికీ వైకాపా రంగులు వేసేయడం పెద్ద వివాదానికే దారి తీసింది. ఇందుకోసం వేల కోట్లు ఖర్చు చేయడం, దీనిపై కోర్టుల్లో కేసులు నమోదవడం, కోర్టు మొట్టికాయలు వేయడం తెలిసిన సంగతే.
తాజాగా వైకాపా ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ కోసం అందుబాటులోకి తెచ్చిన వాహనాలకు సైతం పార్టీ రంగులు వేసేసింది. ఐతే ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో రేషన్ డెలివరీ వాహనాలకు వైకాపా రంగులు ఉండటం ఓటర్లపై ప్రభావం చూపుతుందంటూ ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.
రేషన్ డెలివరీ వాహనాలకు వైకాపా రంగులు తొలగించాలంటూ నిమ్మగడ్డ రమేష్ నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. యధావిధిగా దీనిపై జగన్ సర్కారు కోర్టు మెట్లు ఎక్కింది. దీంతో మరోసారి ప్రభుత్వానికి, ఎస్ఈసీకి ఘర్షణ తప్పదని అంతా అనుకున్నారు. జగన్ సర్కారుకు కోర్టు నుంచి మరోసారి మొట్టికాయలు తప్పవని కూడా భావించారు.
అయితే, అనూహ్యంగా ఈ వ్యవహారంపై తాజాగా ఎస్ఈసీ వెనక్కు తగ్గి అందరికీ షాకిచ్చింది. ఈ కేసు విచారణకు రాకముందే ఎస్ఈసీ వెనక్కి తగ్గి….వాహనాల రంగులు తొలగించాలన్న ఆదేశాలను వెనక్కి తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణకు స్వీకరించకుండానే హైకోర్టు కొట్టివేసింది. గతంలో జగన్ సర్కార్ పై సుప్రీం కోర్టు వరకు వెళ్లి పోరాడిన నిమ్మగడ్డ…తాజాగా ఇలా కేసు విచారణకు రాకముందే వెనక్కు తగ్గడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప్పు..నిప్పులా ఉన్న జగన్, నిమ్మగడ్డ కలిసిపోయారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదొక్కటే కాదు…కొంతకాలంగా ప్రభుత్వంతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరుపూ కూడా టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా నిమ్మగడ్డ పట్టించుకోవడం లేదని స్వయంగా చంద్రబాబు ఆరోపించారు. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా వర్ల రామయ్య ఇదే విషయాన్ని ప్రస్తావించగా….ఆయనపై నిమ్మగడ్డ అసహనం వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వంతో నిమ్మగడ్డ కాంప్రమైజ్ అయినట్టు కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది.