ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ నిలిపివేసింది. దీంతో, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఎస్ఈసీ ఆశ్రయించింది. సుప్రీంకోర్టు నిబంధనలకు సింగిల్ బెంచ్ తీర్పు వ్యతిరేకంగా ఉందని ఎస్ఈసీ పిటిషన్ లో పేర్కొంది. దీనిని అత్యవసర పిటిషన్ గా భావించి విచారణ జరపాలని డివిజన్ బెంచ్ కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే ఏపీీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భేటీ అయ్యారు. తాజా పరిణామాలతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి గల కారణాలను గవర్నర్ కు నిమ్మగడ్డ వివరించారు.
హైకోర్టులో జరిగిన పరిణామాలు.. తీర్పుపై అప్పీల్ చేసిన విషయాలను గవర్నర్కు చెప్పారు. అర్ధగంట పాటు వీరిద్దరి సమావేశం సాగింది. ఈ సమావేశం సందర్భంగా ఏపీ సర్కార్ తీరుపై గవర్నర్ కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. ఎస్ఈసీలోని ఉద్యోగులను జగన్ సర్కార్ ప్రభావితం చేస్తోందని చెప్పారు. ఎస్ఈసీ జాయింట్ డైరెక్టర్ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లిన విషయాన్ని గవర్నర్ దృష్టికి నిమ్మగడ్డ తీసుకొచ్చారు. ఎస్ఈసీకి ఉద్యోగులు సహకరించకుండా పరోక్షంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ నిమ్మగడ్డ ఆరోపించారు. ఎస్ఈసీకి సహకరించబోమని ఉద్యోగ సంఘాలు బహిరంగంగానే మీడియా సమావేశాలు పెట్టిన విషయాన్ని గవర్నర్ దృష్టికి నిమ్మగడ్డ తీసుకెళ్లారు.