పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఉద్యోగులను, అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామంటూ పెద్దిరెడ్డి వార్నింగ్ ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డిని హౌస్ అరెస్టు చేయాలని, మీడియాతో మాట్లాదనివ్వొద్దని డీజీపీ సవాంగ్ కు నిమ్మగడ్డ లేఖ రాశారు. అయితే, ఆఫీసు కార్యక్రమాలను పెద్దిరెడ్డి యథావిధిగా ఇంటి నుంచి నిర్వహించుకోవచ్చన్నారు.
ఇలా చేసేందుకు ఎన్నికల కమిషన్కు విస్తృత అధికారాలున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల ప్రక్రియను పట్టించుకోని సందర్భాల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలున్నాయని గుర్తు చేశారు. అయితే, నిమ్మగడ్డ తనకు నోటీసులివ్వకుండానే చర్యలకు ఆదేశించారని పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోని పరిణామాలు నిశితంగా పరిశీలించాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నిమ్మగడ్డ లేఖ రాసినట్టు తెలుస్తోంది.
కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు పెద్దిరెడ్డి చేసిన హెచ్చరికలను కేంద్ర హోంశాఖ దృష్టికి నిమ్మగడ్డ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతోపాటు, రాజ్యాంగ విధులకు విఘాతం కలిగించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులపై సెన్స్యూర్ విధించామని, పలువురు కలెక్టర్లను బదిలీ చేశామని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న చిత్తూరులో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఈ పరిస్థితులు గమనించాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. పరిస్థితులను బట్టి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆ లేఖలో కోరినట్లు తెలిసింది. మరి, ఈ లేఖపై కేంద్ర హోం శాఖ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.