రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇప్పటి వరకు ఆయనను ఓ విలన్‌గా ప్రజంట్ చేస్తున్నవారికి చెక్ పెడుతూ.. తాజాగా ఆయన తన మనసులో మాటలను వెల్లడించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విధివిధానాలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం.. ఈ సమయంలో చర్చించిన విషయాలపై ఆయన మీడియాకు వివరాలను స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్.. రెచ్చిపోతున్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో ఆయనకు హద్దు, అదుపు లేకుండా పోయిందని.. అధికార పార్టీ నేతలు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు. గడిచిన 24 గంటలుగా ఈ వ్యాఖ్యలు భారీ ఎత్తున వైరల్ అవుతున్నాయి.
మరీ ముఖ్యంగా.. రాష్ట్ర పంచాయతీశాఖ కార్యదర్శి గోపాల కృష్ణద్వివేదీ, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్లను అభిశంసించడం, ప్రొసీడింగ్స్ జారీ చేయడం, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు సిఫారసు చేయడం రాష్ట్రంలో పెను కలకలం సృష్టించింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో ఇదే విషయం చర్చకు వచ్చింది. దీంతో ఇంకేముంది.. ఎన్నికల కమిషనర్‌పై విమర్శలు గుప్పిస్తూ.. వైసీపీకి చెందిన కొందరు సోషల్ మీడియా వింగ్ నేతలు.. వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. వీటిపై తాజాగా జరిగిన మీడియా సమావేశంలో స్పందించిన రమేష్ కుమార్.. వీటిని ఖండించారు. తాను అలా చర్యలు తీసుకోవాలనిఎవరినీ ఆదేశించలేదని చెప్పారు.
అంతేకాదు.. తన మనసులోఉన్న మాటను కూడా ఆయన చెప్పుకొచ్చారు. “నేను కూడా గతంలో అనేక సార్లు..అనేక పదవుల్లో ఉన్నారు. ముఖ్యంగా కలెక్టర్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాను. క్షేత్రస్థాయిలో అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు ఉంటాయో.. నాకు తెలుసు. నాకు ఏ అధికారిపైనా ప్రతీకారం(వెండెట్టా) లేదు., ఎవరిపైనా చర్యలు తీసుకోవాలని నేను కోరలేదు. అయితే.. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నందున అదే విషయాన్ని ద్వివేదీ, గిరిజా శంకర్ సర్వీసు రికార్డుల్లో పేర్కొనాలని మాత్రం చెప్పాను. వారి ప్రవర్తన మున్ముందు బాగుంటే.. నేనే వాటిని తీసేయాలని ఆదేశిస్తాను. లేదా ప్రభుత్వమైనా.. వారి ప్రవర్తన బాగుందని అనిపిస్తే.. తీసేయొచ్చు. ఇది పెద్ద విషయం కాదు. దీనివల్ల వారికి ఇబ్బంది కూడా రాదు“ అని వివరించారు.
ఇక, ఉద్యోగ సంఘాల నాయకులు తనపై వ్యక్తిగతంగా చేసిన విమర్శలను కూడా తాను పట్టించుకోవడం లేదని నిమ్మగడ్డ చెప్పుకు రావడం ఉద్యోగ సంఘాల నేతలకు హర్షణీయంగా మారింది. “నాకు ఉద్యోగ సంఘాల నేతలకు మంచి సంబంధాలు ఉన్నాయి(ఇప్పుడు కాదు.. గతంలో) వారి సమస్యలు నాకు తెలుసు. నేను ఉద్యోగ సంఘాలకు అనుకూలమే. వారేదో క్షణికావేశంలో నాపై విమర్శలు చేశారు. దీనిని నేను సానుకూల దృక్ఫథంతోనే తీసుకుంటున్నాను. ఎవరిపైనా నాకు వ్యతిరేకత లేదు. అందరూ కలిసిమెలిసి.. పనిచేయాలని మాత్రమే కోరుతున్నాను. వారు ఉద్యోగులు.. నేను కూడా ఉద్యోగినే. కాకపోతే.. నేను కొంచెం పెద్ద ఉద్యోగిని! అంతే తేడా“ అని నిమ్మగడ్డ పేర్కొనడంతో ఇప్పటి వరకు తమపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని.. భావించిన హద్దు మీరిన ఉద్యోగుల సంఘాల నాయకుల కు ఆనందం తెప్పించడం గమనార్హం.