ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా మారింది తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తమ్ముడి పెళ్లి. రాజా సోదరుడు గణేశ్.. సుకీర్తిల వివాహ రిసెప్షన్ గురువారం భారీగా సాగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు..ఎమ్మెల్సీలు.. ఎమ్మెల్యేలు.. వీవీఐపీలు పలువురు హాజరయ్యారు. అయితే.. పెళ్లి వేడుక హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకుంటే.. పెళ్లి రిసెప్షన్ కారణంగా వేలాది మంది ప్రజలు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు.
భారీ ట్రాఫిక్ జాంతో పాటు.. గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోవటంతో జనాలకు నరకం అంటే ఏమిటో చూశారు. పెళ్లి వేడుకకు సంబంధించిన వేదిక నేషనల్ హైవే మీద నుంచి వెళ్లే మార్గం సింగిల్ రోడ్డు కావటం.. పెద్ద పెద్ద వాహనాలు భారీగా వచ్చేయటంతో.. ట్రాఫిక్ జాం నెలకొంది. అదికాస్తా చైన్ సిస్టంలో జాతీయ రహదారి మీదా ప్రభావాన్ని చూపించింది. వేలాది వాహనాలు నిలిచిపోవటంతో.. అందులో నుంచి బయటపడటం అన్నది పెద్ద సవాలుగా మారింది.
ట్రాఫిక్ ను నియంత్రించే విషయంలో పోలీసుల వైఫల్యంపై సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వీలుగా చుట్టుపక్కల స్కూళ్లు.. కాలేజీలకు చెందిన బస్సుల్ని వినియోగించారు. దీంతో.. స్కూళ్లు.. కాలేజీలకు సెలవు ఇచ్చేయటం అందరిని విస్మయానికి గురి చేసింది. ఎంత ఎమ్మెల్యే తమ్ముడి పెళ్లి వేడుక అయితే మాత్రం సెలవు ఇచ్చేయటమేనా? అన్న విమర్శలు వెల్లువెత్తాయి. స్కూళ్లకు సెలవు ఎలా ఇస్తారని ప్రశ్నించగా.. డీఈవో ఆదేశాలతో సెలవు ఇచ్చినట్లుగా పేర్కొనటం గమనార్హం.
పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు వీలుగా నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామం.. మండలం నుంచి ప్రజలు హాజరయ్యేందుకు వీలుగా విద్యా సంస్థల బస్సుల్ని ఏర్పాటు చేయటం.. వాటిని జాతీయ రహదారి పక్కన నిలిపివేయటంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. పెళ్లి వేడుకలో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించిన వైనం విమర్శలకు తావిచ్చింది. ఏమైనా అధికార పార్టీ ఎమ్మెల్యే తమ్ముడి పెళ్లి అంటే మాటలా? అన్న భావన కలిగేలా చేసింది.