రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో ఎస్టీలు, ఎస్టీలపై దాడులు పెరిగాయని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఎస్సీల ఓట్లతో గెలిచిన జగన్ చివరకు వారిపైనే దాడులకు పాల్పడుతున్నారని ఎస్సీ సంఘాలు మండి పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మహానాడు సందర్భంగా మాదిగలపై చంద్రబాబు వరాల జల్లు కురిపించారు.
రాబోయే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, అధికారంలోకి వస్తే ప్రభుత్వ పదవుల్లో మాదిగలకు పెద్దపీట వేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతోపాటు, జిల్లాల ప్రాతిపదికన జనాభా దామాషా ప్రకారం జీవో 25ను అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు మాదిగ సంఘం నాయకులు నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈ రోజు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ సభకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు అతిథిగా హాజరవవ్వబోతున్నారని టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు వెల్లడించారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగలు తరలిరాబోతున్నారు.