ఒంగోలు వైసీపీ కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తా గురించి ఇరు తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర లేదు. ఒకే ఒక్క వీడియోతో ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో గుప్తా పాపులర్ అయ్యారు. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ గుప్తా చేసిన కామెంట్లు అధికార పార్టీలో కాక రేపాయి. వైసీపీ కార్యకర్తను అంటూనే సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్న గుప్తాపై ఆ పార్టీ నేతలు దాడి చేయడం పెను దుమారం రేపింది.
ఆ తర్వాత గుప్తాను బాలినేని బుజ్జగించడంతో ఆ వ్యవహారం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా గుప్తా…ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా తనకు ప్రాణహాని ఉందని, అమిత్ షానే తనను కాపాడాలని ప్లకార్డు పట్టుకొని దర్శనమివ్వడంతో మరోసారి గుప్తా పేరు వార్తల్లోకి వచ్చింది. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు గుప్తా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరగడం, ఢిల్లీలో ఉన్న వైసీపీ రెబ్ల ఎంపీ రఘురామను గుప్తా కలవడం చర్చనీయాంశమయ్యాయి. షాతో సుబ్బారావు భేటీకి రఘురామ రాయబారం చేస్తున్నారని పుకార్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత గుప్తా వ్యవహారం సద్దుమణిగింది.
అయితే, అనూహ్యంగా తాజాగా గుప్తా పేరు మరో వివాదంలో తెరపైకి వచ్చింది. సుబ్బారావు గుప్తాపై ఒంగోలు మేయర్ గంగాడ సుజాత ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఒంగోలు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంగోలులోని మంగమూరు సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టాలని స్థానిక ఆర్య వైశ్యులు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే విగ్రహం ఏర్పాటు అనుమతి కోసం మేయర్ సుజాత దగ్గరకు ఆర్యవైశ్యులతోపాటు గుప్తా కూడ వెళ్లారట. ఈ సందర్భంగా తనను గుప్తా కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, గుప్తాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామని ఒంగోలు వన్ టౌన్ ఎస్సై వెల్లడించారు. అయితే, ఇటీవల ఎంపీ రఘురామను కలవడం, తనకు ప్రాణ హాని ఉందని ఢిల్లీలో ప్లకార్డు ప్రదర్శించడం వంటి పరిణామాల నేపథ్యంలోనే గుప్తాను వైసీపీ నేతలు మరోసారి టార్గెట్ చేశారని ప్రచారం జరగుతోంది.