సీఎం జగన్ హయాంలో హిందూ ఆలయాలు, ఆస్తులు, దేవుళ్ల విగ్రహాలపై దాడులు పెరిగిపోయాయన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని టీడీపీ నేతలు, బీజేపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువైందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో జగన్ వైఖరిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. జగన్ పాలనలో క్రిష్టియానిటీ పెరుగుతోందని ఏపీలో ఎంతోమంది ప్రజాప్రతినిధులు క్రిష్టియన్లని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ గతంలోనే సంచలన ఆరోపణలు చేశారు.
ఎన్నికలలో గెలిచేందుకు హిందువులమని చెప్పుకుంటున్న చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని రఘురామ షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, ఏపీలో క్రిస్టియానిటీ వ్యవహారంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లీగల్ ప్రొటెక్షన్ ఫోరం వారు ఫిర్యాదు చేశారని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా రఘురామ తాజాగా లేఖ రాశారు. ఈ క్రమంలోనే రఘురామ ఆరోపణలకు తగ్గట్లుగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరితపై జాతీయ ఎస్సీ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హోంమంత్రి సుచరిత షెడ్యూల్డ్ కులాల హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు ఆదేశించింది.
అంతేకాదు, వారం రోజుల్లో విచారణ జరపాలని గుంటూరు కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను ఎస్సీ కమిషన్ ఆదేశించింది. సుచరిత ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. గతంలో ఒక న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను జీసెస్ ను ప్రార్థిస్తానని సుచరిత చెప్పారని ఆ సంస్థ ఆరోపించింది. అంతేకాదు, ఆ వీడియో క్లిప్పింగ్‌ను జతచేసి ఈ ఏడాది జూన్‌లో జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీంతో, తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించింది.
అయితే, ఏపీలో ఈ తరహా వ్యవహారం కొత్తేమీకాదు. గతంలో మాజీ కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై సివిల్ సర్వీసెస్ కమిషన్‌కు ఈ సంస్థ ఫిర్యాదు చేసింది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కులధ్రువీకరణ విషయంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. ఇలా, ఏపీలో జగన్ వచ్చిన తర్వాతే క్రిస్టియానిటీకి సంబంధించిన ప్రచారం ఎక్కువగా జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. బాధ్యత గల ప్రజా ప్రతినిధులు ఇలా ప్రవర్తించడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ఈ వ్యవహారంపై సుచరిత స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.