77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ…ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో జాతీయ జెండాను బాలయ్య బాబు ఎగురవేశారు. ఆసుపత్రిలోని రోగులకు, చిన్నారులకు ఆయన మిఠాయిలు పంచిపెట్టారు. క్యాన్సర్ పై పోరాడుతున్న చిన్నారులు, వారికి సేవలందిస్తున్న వైద్యులతో కలసి త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా బెలూన్లను గాలిలో ఎగుర వేశారు.
గత 23 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నిరంతరాయంగా సేవలను అందిస్తున్నామని బాలయ్య తెలిపారు. ఎంతో ఉన్నతాశయంతో తన తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ ఆసుపత్రిలో సేవలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. దేశానికి ఎందరో మహనీయులు సేవలందించారని, అందులో ఎన్టీఆర్ ఒకరని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల కోసం అన్నగారు స్థాపించిన బసవతారకం ఆసుపత్రి ఎంతో మంది క్యాన్సర్ రోగులకు నిరంతరాయంగా సేవలందిస్తోందని అన్నారు.
భారత దేశంలో డ్రగ్స్, అలసత్వం, అవినీతి వంటి జాడ్యాలు యువతను పట్టి పీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వాటిపై పోరాడాలని యువతకు పిలుపునిచ్చారు. ఎందరో మహానుభావులు త్యాగ ఫలితమే స్వాతంత్ర్యం అని, వారి ప్రాణత్యాగాల వల్లే మనం ఈ రోజు స్వేచ్ఛావాయువులు పీల్చగలుగుతున్నామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో చాలామందికి తినేందుకు తిండి లేదని, ఇప్పుడు చంద్రుడిపైన కాలుమోపే స్థాయికి ఎదిగామని దేశ ప్రగతిని కొనియాడారు. భారత దేశ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని ఎందరో మహానుభావులు, విప్లవకార్లు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని అన్నారు.