కాలం మారుతోంది. అందుకు తగ్గట్లుగా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది.
తీవ్రమైన నేరాలు చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాల్సింది. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. కానీ.. ప్రాణం పోసే శక్తి లేని మనిషి.. ప్రాణాన్ని తీసే విషయంలో ఇప్పటికి అనాగరికమైన విధానాల్ని వాడటం తప్పే.
దారుణ నేరాలకు పాల్పడిన వారికి మరణశిక్ష విధించటానికి వ్యతిరేకం కాదు. కానీ.. పిట్టల మాదిరి పదుల సంఖ్యలో నేరస్తులకు మరణశిక్ష అమలు చేయటంతోనే అభ్యంతరమంతా.
ప్రపంచ దేశాల్లో అత్యధిక మరణశిక్షల్ని అమలు చేసే దారుణ ట్రాక్ రికార్డు సౌదీ అరేబియా సొంతం.
ఈ దేశంలో నేరస్తులకు నిర్మోహమాటంగా మరణశిక్ష విధిస్తారు. చిన్న నేరాలకు సైతం.. మరణశిక్ష విధించటం ద్వారా.. నేరాల చేసే ఆలోచన రావటానికి సైతం వణికేలా చేస్తుంటారు. అయితే.. వీరి కారణంగా కొందరు అమాయకులు సైతం ప్రాణాలు కోల్పోతుంటారన్న ఆరోపణ ఉంది.
తాజాగా ఆ దేశంలో ఒకే రోజున 81 మంది దోషులకు మరణశిక్షను అమలు చేయటం షాకింగ్ గా మారింది. రికార్డు స్థాయిలో ఒకే రోజు ఇంత మందికి మరణశిక్ష అమలు చేయటం జీర్ణించుకోలేనిది.
1980లో మక్కా మసీదు స్వాధీనం నేరంలో 63 మంది తలలు నరికి సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్షను అమలు చేసింది. భారీ ఉగ్రదాడిలో పలువురి ప్రాణాలు తీసిన వారికి విధించే ఉరిశిక్ష అమలు వేళలో.. మానవ హక్కుల పేరుతో సన్నాయి నొక్కులు నొక్కే వారి నోళ్లు ఇలాంటి వేళలో ఏమవుతాయి? అన్నది ప్రశ్న.
ఇంత భారీగా మరణశిక్షలు అమలు చేసే సౌదీ తీరుపై ఏ దేశం నోరు విప్పదు సరికదా.. అసలు ఆ విషయం జరగనట్లుగా.. మౌనంగా ఉండటం కనిపిస్తుంది.
మిగిలిన దేశాల్లోని మరణశిక్షలపై హక్కుల మాటలు మాట్లాడే వారంతా సౌదీలో ఇంత భారీ ఎత్తున మరణశిక్షల్ని అమలు చేయటాన్ని వేలెత్తి చూపరెందుకు? ఇక.. మరణశిక్ష అమలైన వారిలో మహిళల్ని.. పిల్లల్ని చంపిన వారితో పాటు అల్ ఖైదా.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు.. యెమన్ లో హైతీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చిన వారు ఉన్నారు.
క్రూరమైన నేరాలు తప్పించి.. మిగిలిన వాటికి మరణ శిక్షను మినహాయించాల్సిన అవసరం ఉంది.