మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతి అమెరికన్ సత్య నాదెళ్ల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల (26) అనారోగ్యంతో కన్ను మూశారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జైన్..తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ వ్యాధి బారిన పడ్డ జైన్ నాదెళ్ల…వీల్ చైర్ కే పరిమితమయ్యారు. జైన్ మరణించినట్టు మైక్రోసాఫ్ట్ కంపెనీ తన ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా తెలియజేసింది.
నాదెళ్ల కుటుంబం కోసం ప్రార్థించాలని, వారికి ఏకాంతాన్ని ఇవ్వాలని కోరింది. జైన్ నాదెళ్ల మరణంతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల విషాదంలో మునిగిపోయారు. చాలా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నారు. సత్య నాదెళ్ల, అనుపమ దంపతులకు కుమారుడు జైన్ తోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జైన్ జన్మించినప్పుడు తన కుటుంబానికి ఎదురైన అనుభవాలు, ఆ సమయంలో ఎదుర్కొన్న కష్టాల గురించి తన జీవితంపై రాసుకున్న ఆటో బయాగ్రఫీ ‘హిట్ రిఫ్రెష్’ పుస్తకంలో సత్య నాదెళ్ల పలు విషయాలు వెల్లడించారు.
జైన్ పుట్టుక తమ జీవితాలనే మార్చేసిందని, తాను, అనుపమ కెరీర్ లో మంచి స్థాయిలో ఉన్నామని చెప్పారు. తొలి సంతానం కోసం ఎదురుచూస్తున్న తమకు… ప్రెగ్నెన్సీ 36వ వారంలో షాక్ తగిలిందని వెల్లడించారు. కడుపులో బిడ్డ కదలికలు ఆగిపోయాయని, సిజేరియన్ చేసి జైన్ ను వైద్యులు బయటకు తీశారని చెప్పారు. కిలోన్నర బరువున్న జైన్.. పుట్టాక ఉలుకూ..పలుకూ లేదని, ఆ తర్వాత వైద్యులు చికిత్స చేసి సెరిబ్రల్ పార్సీ అని నిర్ధారించారని అన్నారు. గర్భంలో ఉన్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో వచ్చిన సమస్య వల్లే జైన్ ఆరోగ్యానికి హాని జరిగిందన్నారు.