వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ `సరిపోదా శనివారం`. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్.జె సూర్య ప్రతినాయకుడిగా.. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. ఆగస్టు 29న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన సరిపోదా శనివారం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అభిమానులతో పాటు ప్రేక్షకులను సైతం ఈ చిత్రం మెప్పించింది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలు నాని మూవీపై భారీ ఎఫెక్ట్ చూపుతున్నాయి. సోలో రిలీజ్ సొంతం చేసుకున్నప్పటికీ.. వర్షాల ప్రభావంతో తొలి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టింది. రెండో రోజు దుమ్ము లేపుతుందని అనుకున్నా కూడా పెద్దగా గ్రోత్ చూపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.88 కోట్ల షేర్, రూ. 8.85 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన సరిపోదా శనివారం.. రెండో రోజు రూ. 3.04 కోట్ల షేర్, రూ. 5.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
రెండు రోజుల టోటల్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మరియు రెండో రోజు కలిపి రూ. 8.92 కోట్ల షేర్, రూ. 13.95 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లో సరిపోదా శనివారం సినిమా రూ. 16.72 కోట్ల షేర్, రూ. 30.70 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 42 కోట్లు కాగా.. మరో రూ. 25.28 కోట్ల షేర్ వస్తే బాక్సాఫీస్ వద్ద సరిపోదా శనివారం క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఎలాగో టాక్ అనుకూలంగా ఉంది కాబట్టి ఫుల్ రన్ లో నాని టార్గెట్ ను రీచ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.