విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల వయసులో ఈ అమ్మడు తన సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డు వేసింది. ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వరలక్ష్మికి ఇది మొదటి వివాహం కాగా.. నికోలాయ్ కు మాత్రం రెండవది.
నికోలాయ్ సచ్దేవ్ మొదట కవిత అనే మోడల్ ను 2011లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు పవర్ లిఫ్టింగ్‌లో నేషనల్ వైడ్ పతకాలు సాధించిన కష సచ్దేవ్ అనే కూతురు కూడా ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం విభేదాల కారణంగా నికోలాయ్-కవిత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నికోలాయ్ వరలక్ష్మితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరికీ 14 ఏళ్లుగా పరిచయం ఉంది. మొదట స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు.
ఇప్పుడు పెద్దల అంగీకారంలో భార్యభర్తలు అయ్యారు. జులై 2న థాయ్‌లాండ్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానికి ముందు హల్దీ, మెహీందీ, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. అలాగే ఇటీవల చెన్నైలోని తాజ్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ను కూడా నిర్వహించారు. రిసెప్షన్ కు రాజకీయ, సినీ ప్రిములు హాజరై సందడి చేశారు. ఇదిలా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి వరలక్ష్మి శరత్‌కుమార్ – నికోలాయ్ సచ్దేవ్ పెళ్లి కోసం రూ. 200 కోట్లు ఖర్చు పెట్టారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై తాజాగా వరలక్ష్మి తండ్రి, ప్రముఖ నటుడు శరత్ కుమార్ స్పందించారు. `వరలక్ష్మి పెళ్లి కోసం రూ. 200 కోట్లు ఖర్చు పెట్టామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అసలు అంత డబ్బు ఎక్కడుందో కూడా నాకు తెలియదు. చాలా సాధారణంగా నా కూతిరి పెళ్లి చేశాను. తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు` అంటూ శరత్ కుమార్ వివరణ ఇచ్చారు.