‘బ్రో’ మూవీలో తనను కించపరిచేలా చేశారంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్టు కావటం.. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేయటంతో పాటు.. ఆయన రియల్ లైఫ్ ను సినిమాగా చేసే ఆలోచన ఉందన్న మాట చెప్పటం తెలిసిందే. పవన్ మీద మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై జనసైనికులు తీవ్రంగా రియాక్టు అయ్యారు. జనసేన కార్యకర్తలు.. పార్టీ మహిళా విభాగానికి చెందిన వీర మహిళలు తిరుపతిలో మంత్రి అంబటి తీరుపై వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ప్రొడక్షన్ నంబరు 6093 జగ్గుబాయ్ సమర్పించు ‘సందులో సంబరాలు శ్యామ్ బాబు అలియాస్ రాంబాబు’ పేరుతో కొత్త సినిమాను షురూ చేస్తున్నట్లుగా హడావుడి చేశారు. తమ అధినేత పవన్ నటించిన బ్రో మూవీపై మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసనలో భాగంగా ఒక వ్యక్తిని ముందుగా మంత్రి ఫేస్ ఉన్న మాస్కును తగిలించారు. సదరు వ్యక్తిని కూర్చోబెట్టి స్వామి వారి ఎదుట పూజలు చేయించారు.
అనంతరం క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించారు. సదరు వ్యక్తిని గొబ్బెమ్మలా కూర్చోబెట్టి.. వీర మహిళలు అతడి చేతులకు గాజులు వేశారు. డ్యాన్సులు చేస్తూ.. తమ నిరసనను తెలియజేశారు. ఈ వినూత్న నిరసనపై మంత్రి రియాక్షన్ ఎలా ఉండనుంది? అన్నది ప్రశ్నగా మారింది. బ్రో మూవీలో శ్యామ్ బాబు పేరుతో ఉన్న పాత్ర తనను ఉద్దేశించి పెట్టిందిగా మంత్రి అంబటి ఆరోపిస్తున్నారు. తాను సంక్రాంతి వేళ డ్యాన్సు వేసిన సందర్భంగా వేసుకున్న డ్రెస్ మాదిరే బ్రో సినిమాలో ధరింపజేశారన్నది ప్రధాన ఆరోపణ. అంబటి వర్సెస్ పవన్ గా మారిన ఈ ఎపిసోడ్ రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.